హైదరాబాద్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీసీ ఆత్మగౌరవ సభ దద్దరిల్లింది. ప్రధాని మోదీ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ల జోడి తెలంగాణ చరిత్రను తిరగరాయబోతోందని స్పష్టమైంది. క్రికెట్ మ్యాచ్ కంటే ఎక్కువగా కిక్కిరిసిపోయిన స్టేడియాన్ని చూస్తే బీజేపీ హవా తెలంగాణలో బయట చేస్తున్న ప్రచారం కన్నా చాలా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది. సభా వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనలకు.. చేసిన విమర్శలకు ఎవరి వద్దా సమాధానం లేకుండా పోయింది.
బీజేపీ వస్తుంది – బీసీని సీఎంను చేస్తుంది
బీజేపీ వస్తుంది.. బీసీని సీఎంను చేస్తుందని ప్రధాని మోదీ నినదించారు. బీజేపీ ఎలా సామాజిక న్యాయం చేసిందో ఆయన వివరించారు. రాష్ట్రపతులు, స్పీకర్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎన్నికయ్యేలా చూశామన్నారు. తమ ప్రభుత్వంలో ఓబీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. ప్రధాని మోదీ ఈ వివరాలన్నీ వేదికపై నుంచి చెప్పిన తర్వాత తెలంగాణలో బీసీ సీఎం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని ఓ ప్రభంజనం అని చాలా మందికి అర్థమైంది. అందుకే ఇతర పార్టీల నేతలు … బీసీ సీఎం నినాదంపై నోరు మెదపకలేకపోతున్నారు.
మిత్రపక్షాలకు ఇచ్చే గౌరవం అలాంటిది !
పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే ప్రసంగంలోనూ పవన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన వెనుక పవన్ ఉన్నారన్నారు. మోదీ మాటలు తమ తో పొత్తులో ఉన్న వారిని ఎలా గౌరవిస్తారో స్పష్టం చేసేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా మోదీ అజేయమైన శక్తి గురించి మాట్లాడారు. మోదీ దేశం కోసం పని చేస్తారని రాజకీయాల కోసం కాదని పవన్ గట్టిగా చెప్పారు. అటు మోదీ.. ఇటు పవన్ రాజకీయంలో మిత్రపక్షాల పట్ల ఎవరు ఎలా వ్యవహరించాలో స్పష్టమైన సందేశం ఉంది. ఈ ఇద్దరి జోడి తెలంగాణలో సంచలనం సృష్టించడ ఖాయమని.. ఎల్బీ స్టేడియం సభ ద్వారా స్పష్టత వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు
బీజేపీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ రేసులో లేదని ప్రచారం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రచారాలను.. బీజేపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అభ్యర్థులే లేరని ప్రచారం చేశారు. కానీ ఒక్కో స్థానం కోసం ఐదారుగురు బలమైన అభ్యర్థులు ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి బీజేపీ ఇప్పుడు ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే సరికి… అన్ని పార్టీల కన్నా బీజేపీనే ముందు ఉందన్న అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేయడం ఖాయమని చెప్పుకోవచ్చు.