రెండు సార్లు కూలిన వంతెన – అవినీతికి నిదర్శనమా ?

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పుడు భారత్ దర్శన్ యాత్ర చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించేసేందుకు విపక్షాలను కూడగట్టుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారాయన. చెన్నై, భువనేశ్వర్, కోల్ కతా అంటూ ఎక్కిన ఫ్లైట్ ఎక్కకుండా ఆయన తన ప్రయత్నాలను సాగిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి సంగతి దేవుడెరుగు, అసలు బిహార్లో ఏ జరుగుతుందో కూడా పట్టించుకునే తీరిక ఆయనకు లేదు.దానితో నితీశ్ అనుచరులు, అధికారులు రెచ్చిపోయి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న చర్చ మొదలైంది. ఇప్పుడో దుర్ఘటనతో ఆ చర్చ నిజమని తేలిపోయింది..

భగల్పూర్ వంతెన నేలమట్టం

భగల్పూర్ దగ్గరి సుల్తాన్ గంజ్ అగ్వానీ వంతెన ఆదివారం అకస్మాత్తుగా కూలిపోయింది. అది నిర్మాణంలో ఉంది. బ్రిడ్ద్ కూలిపోతున్న సన్నివేశాన్ని ఎవరో వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. గంగానదిపై సుదీర్ఘకాలంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ లో కూడా ఈ వంతెనకు సంబంధించి కొంతభాగం కూలిపోవడంతో కథ మొదటికొచ్చి నిర్మాణ పనులను వేగవంతం చేశామని నితీశ్ ప్రభుత్వం చెప్పుకుంది.నిర్మాణంలో ఉన్న ఒక వంతెన రెండు సార్లు కూలడం నిర్లక్ష్యం, అవినీతి కాకుండా మరేమిటని సామాన్య జనం కూడా ప్రశ్నిస్తున్నారు..

తేజస్వీ కుంటిసాకులు

బ్రిడ్జ్ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించి నితీశ్ కుమార్ చేతులు దులుపుకున్నారు. హరియాణాకు చెందిన ఎస్పీ సింగ్లా అనే కన్ స్ట్రక్షన్ కంపెనీ ఈ వంతెనను నిర్మిస్తోంది. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వంతెన కూలడం వెనుక తమ తప్పేమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించారు. వంతెనలోని అన్ని సెగ్మెంట్ల సాంకేతిక పరీక్షలు చేసి వంతెన కూలడానికి కారణాలు అన్వేషిస్తామని తేజస్వీ వెల్లడించారు. మొదటిసారి వంతెన కూలినప్పుడే విచారణకు ఆదేశించామని మూడు ఐఐటీలకు చెందిన నిపుణులు ఈ పనిలో ఉన్నారని ఆయన అన్నారు. తొలిసారి కూలినప్పుడు ఐఐటీ రూర్కీ నిపుణులు ఇచ్చిన నివేదకను కూడా ఆయన బయటపెట్టారు.

రూ. 1,750 కోట్ల అవినీతి జరిగిందంటున్న బీజేపీ

తాజా దుర్గటనపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షేజాద్ పూనావాలా.. దానికి బ్రిడ్ద్ కరప్షన్ అని పేరు పెట్టారు. రూ, 1,750 కోట్లు గంగపాలయ్యాయని, అధికార పార్టీ వారు తినేశారని ఆయన ఆరోపించారు. విపక్షాలు దీని కూడా మోదీ వైఫల్యంగా చిత్రీకరిస్తారని ఆయన సెటైర్లు వేశారు.

రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్

నితీశ్, తేజస్వీ రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. 2020లోనే నిర్మాణం పూర్తి కావాల్సిన ఈ వంతెన జాప్యానికి కారణాలు ప్రభుత్వమే చెప్పాలని, రెండో సారి కూలినందున వారిద్దరూ అధికారంలో ఉండేందుకు అర్హులు కాదని మాలవీయ అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంలో ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లే కూలిపోయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే నితీశ్ రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్లో తప్పులేదనిపిస్తోంది.