కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే ఓడించుకుంటారు. కర్ణాటకలో ఈ విషయం మరోసారి రుజువు కాబోతోంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఓ అంఖం అయితే… నోరు జారి అసందర్భ వ్యాఖ్యలు చేసి.. బీజేపీ పని సులువు చేయడంలో ఆ పార్టీ నేతలు ముందంజలోఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటకలో రాను రాను దిగజారిపోతోంది. దీనికి కారణం అక్కడ ముఖ్య నేతలు చేసిన కామెంట్లే.
నోరు జారి విమర్శల పాలవుతున్న కర్ణాటక నేతలు
కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవినీతి లింగాయత్ సీఎం అనేశారు. ఈ మాట ఎంతటి ప్రభావం చూపిందో ఆ తరువాతే ఆయనకు తెలిసింది. వ్యక్తిగతంగా విమర్శించినా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, సామాజిక వర్గం పేరుతో విమర్శిస్తేనే తిప్పలు వస్తాయి. ముప్పుతిప్పలు పెడతాయి. బొమ్మై అవినీతి పరుడు అంటే బాగుండేది… కానీ, లింగాయత్ సీఎం అవినీతి పరుడు అనడం అనర్థాలకు దారి తీసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సర్వేల్లో బీజేపీ మరింత మెరుగైన స్థితికి వెళ్లినట్లుగా తేలింది.
మోదీపై దుర్భాషలతో కాంగ్రెస్ కు మరిన్ని కష్టాలు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని విషసర్పంతో పొల్చాడు. చౌకీదార్, చోర్ గా అభివర్ణించారు. ఈ మాటలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రధాని మోడీ ప్రస్తుతం కర్ణాటకలో ర్యాలీలు, సభల్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. తనను 91 మార్లు కాంగ్రెస్ నేతలు విమర్శించారని, ఎన్నిసార్లు తనను విమర్శించినా ప్రజల కోసం ఓర్చుకుంటున్నానని, ప్రజలు ఓటుతోనే వారికి బుద్ది చెబుతారని అన్నారు. ఇవి కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ను వాళ్లే ఓడించుకుంటారు
చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఇలానే నోరుజారి చేసిన విమర్శల కారణంగానే తీవ్రంగా నష్టపోతూ వచ్చింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన బేహారీలు పదం ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారం అన్నది ఎమోషన్తో కూడుకొని ఉంటుంది. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడమే కాకుండా, విమర్శలు చేయాల్సి ఉంటుంది. నాయకులపై తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోకూడా నోరు జారీ తప్పుగా మాట్లాడ కూడదు. కాంగ్రెస్ నేతలకు అదే చేతకాదు.