టిక్కెట్లు ఎగ్గొట్టడానికే ఎమ్మెల్యేలపై నిందలు – మరి కేసీఆర్‌పై ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు

అంతర్థానమైన టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని బీఆర్ఎస్ ఆవిర్భావంగా భావించుకుని నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు దళిత బంధు నిధులు కాజేస్తున్నారని మండిపడ్డారు. సొంత ఎమ్మెల్యేలపై ఓ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి నిందలు వేయడం.. అది కూడా అందరికీ తెలిసేలా చేయడం యాధృచ్చికం కాదు. ఖచ్చితంగా వ్యూహాత్మకమేనని అంటున్నారు. ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేసి వారికి టిక్కెట్లు నిరాకరించడంతో పాటు ఇతర పార్టీల్లో చేరకుండా వారి ఇమేజ్ ను బద్నాం చేసే ప్రయత్నమేనన్న ఆరోపణలు సొంత పార్టీలోనే వస్తున్నాయి. మరి కేసీఆర్‌పై వస్తున్న అవినీతి ఆరోపణల సంగతేమిటని ప్రశ్నించే వారి సంఖ్య పెరుగుతోంది.

టిక్కెట్లు నిరాకరించేందుకు కేసీఆర్ ప్లాన్

భారత రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకుంటున్న వారి లిస్ట్ తన దగ్గర ఉందని తోకలు కత్తిరించేస్తానని హెచ్చరించారు. ఆ ఒక్కటే కాదు.. అనేక అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు, క్యాడర్ కు అందుబాటులో ఉండకపోవడం సహా పలు అంశాలపై మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ కఠినంగా ఉన్నారని అందరికీ టిక్కెట్లు ఉండకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అసలు టిక్కెట్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పేందుకే ఈ సమావేశం పెట్టారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

50 మందిపై నిందలేసి టిక్కెట్లు ఎగ్గొట్టడం ఖాయమా ?

తెలంగాణ ప్రభుత్వ పనితీరు నాసిరకంగా ఉందని.. అందుకే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం తన పాలన గొప్పగా ఉందని ఎమ్మెల్యేల వల్లే వ్యతిరేకత వచ్చిందని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల్ని బలి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని అందులో భాగంగానే వారిపై నేరుగా అవినీతి ముద్ర వేస్తున్నారని అంటున్నారు. సగం మందికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వారికి టిక్కెట్లు ఇస్తే గెలవరని గతంలోనే ప్రచారం చేశారు. కానీ వారంతా బీజేపీలో చేరిపోతారన్న భయంతో మళ్లీ .. అందరికీ టిక్కెట్లు అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి మళ్లీ మాట మార్చేశారు.

మరి కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణల సంగతేంటి ?

తమపై నిందలేస్తున్న కేసీఆర్… ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి ఎందుకు స్పందించరని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల ఖర్చు పెట్టేంత స్థాయి ధనం ఆయనకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తమపై అవినీతి ముద్ర వేసే కుట్రలు చేస్తే.. తెగించి సమాధానం చెప్పాలన్న ప్లాన్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.