వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై పోరాటానికి ఏపీ బీజేప నేతలు కొత్త వ్యూహాలు అమలు చేయబోతున్నారు. ఇందు కోసం గన్నవరంలో 19వ తేదీ శుక్రవారం భారతీయ జనతా పార్టి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కృష్ణాజిల్లా గన్నవరం లో నిర్వహించాలని నిర్ణయించారు. సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ , కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ వి. మురళీధరన్, రాష్ట్ర పార్టీ సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్ తదితర జాతీయ, రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు పాల్గొనను న్నారు.
వచ్చే నెల రోజుల్లో ప్రభుత్వం వైఫల్యాలు బయట పెట్టేలా పలు కార్యక్రమాలు
రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వివిధ అనుబంధ విభాగాల రాష్ట్రస్థాయి బాధ్యులు & అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు & జాయింట్ కన్వీనర్లు ఇతర ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలన విజయవంతంగా ఈనెల 30 తేదీకి పూర్తి అవుతున్న సందర్భంగా మే 30వ తేదీ నుండి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమాలపై సమీక్ష, వైసిపి ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న చార్జిషీట్ ఉద్యమం ,రానున్న రోజుల్లో పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాల రూపకల్పన అంశాలు పై చర్చ జరగనుంది.
చార్జ్ షీట్ ఉద్యమానికి ప్రజల విశేష స్పందన
ప్రజా చార్జ్ షీట్ ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ స్థాయిలో పార్టీ ప్రత్యేకంగా చార్జిషీట్లను తీసుకునే లా వెసులుబాటు కల్పించింది. ఈ కారణంగా బాధితులు పెద్ద ఎత్తున తమ బాధలు చెప్పుకున్నారు. వాటన్నింటినీ బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ప్రభుత్వ అధికారులకు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. వాటిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి బీజేపీ నేతలు .. సమస్యల వారీగా పరిష్కారం కోసం పోరాటాలు చేయనున్నాయి. రాష్ట్ర స్థాయి సమస్యలపై ప్రజలను కలుపుకుని ఉద్యమాలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావశంలో ఈ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
జాతీయ పార్టీపై నమ్మకం పెంచుకుంటున్న ప్రజలు
ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్న ఆలోచన ఏపీ ప్రజల్లో పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర నిధులు, పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోవడం.. పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అభివృద్ధిని పక్కన పెట్టేయడం.. జాతీయ దృక్పథం అసలు లేకుండా చేయడానికి ప్రయత్నించడం వంటివి ప్రజల్లో చర్చకు కారణం అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ.. గత పదేళ్లలో ఏపీ కోసం చేసిన మేళ్లు..ఎయిమ్స్ లాంటి చోట్లకు పేదలు వెళ్లినప్పుడు అవగతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని పార్టీ ఎదుగుదలకు మెరుగ్గా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.