రాయలసీమ డిక్లరేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. . వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమావేశంలో రాయలసీమకు అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గతంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామన్నారు.
2018 ఫిబ్రవరిలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ
మొత్తం 16 డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్‌ను బిజెపి ప్రకటించింది. కర్నూలలో నిర్వహించిన మహాసభలో రాయలసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలంతా హాజరై డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఇందులో కీలకమైన విషయాలు ఉన్నాయి. రాయలసీమ డిక్లరేషన్‌లో రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం.. రెండో రాజధాని ఏర్పాటు చేయడం వంటి డిమాండ్ లు ఉన్నాయి. రైతుల మరణాలను అరికట్టేందుకు, వలసలను నియంత్రించేందుకు రాయలసీమకు రూ.20,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిక్లరేషన్ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని తెలిపింది.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 20 వేల కోట్లు
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల భర్తీ రూ. 20,000 కోట్లు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గురు రాఘవేంద్రస్వామి ప్రాజెక్టులను పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాయలసీమ అభివృద్ధి మండలి పునరుద్ధరణ కూడా డిక్లరేషన్ లో ఉంది. ఇంటింటికీ ఉద్యోగాలు, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ఈ ప్రాంత నేత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించడం వంటివి ఉన్నాయి.
పట్టించుకోని నాటి టీడీపీ ప్రభుత్వం.. నేటి వైసీపీ ప్రభుత్వం
రాయలసీన ప్రజల్ని రాజకీయంగా మభ్య పెట్టడానికే పార్టీలు ఇప్పటి వరకూ ప్రయత్నిస్తున్నాయి. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు అదే చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం… చిత్తశుద్ధితో అభివృద్ధి.. ప్రజల ముందడుగు కోసం విస్తృతంగా చర్చించి డిక్లరేషన్ రిలీజ్ చేసింది. ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ముందు రాయలసీమకు నిధుల విడుదల పెద్ద విషయం కాదు. అయినా పట్టించుకోవడం లేదు. న్యాయరాజధాని పేరుతో మభ్య పెట్టి వైసీపీ మరింత మోసం చేసిందనే భావనలో ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమని… డిక్లేషన్ ను అమలు చేసి తీరుతామని బీజేపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.