కేంద్ర హోంమంత్రి విశాఖ పర్యటన లో చేసిన వ్యాఖ్యలతో.. ఏపీలో పొత్తులపైనా కాస్తంత క్లారిటీ వచ్చినట్లుగా భావిస్తున్నారు. పొత్తులో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నా ఎప్పుడూ కలిసి వచ్చేందుకు ముందుకు రాని జనసేన పార్టీని .. అమిత్ షా కానీ.. జేపీ నడ్డా కానీ పట్టించుకోలేదు. ఆ పార్టీ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. పైగా అమిత్ షా .. ఏపీలో ఇరవై లోక్ సభ సీట్లు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. దీంతో పొత్తుల గురించి ఇక ఏపీ బీజేపీ ఆలోచించదని అంచనా వేస్తున్నారు.
కలసిరాని జనసేనకు బీజేపీ ఝులక్
గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జనసేనాని.. బీజేపీ శరణు కోరారు. బీజేపీ నుంచి ఎవరూ అడగకపోయినా ఆయన ఢిల్లీకి పోయి . కేంద్ర పార్టీతో మాట్లాడుకుని ఏపీ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ ఏపీలో బీజేపీ నేతలతో కలిసి పని చేసేది లేదన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. పైగా కేంద్ర నేతలతో సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర నేతలు పెద్దగా తెలియదంటూ .. రాష్ట్ర నేతలను కించ పరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పవన్ ఎవరో తెలియదన్నట్లుగా అమిత్ షా, జేపీ నడ్డా వ్యవహరించడంతో జనసేనకు ఝులక్ ఇచ్చినట్లయింది.
పొత్తు ధర్మం పాటించడంలో జనసేన విఫలం
ఏ రాజకీయ పొత్తులు అయినా పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని పాటించడంలో పవన్ విఫలమయ్యారని బీజేపీ వర్గాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. కలసి పని చేసి.. కూటమిని బలోపేతం చేయడానికి ఆయన ఎప్పుడూ ముందుకు రాలేదు. ఇతర పార్టీలు.. ఓ వర్గం మీడియా చేసే ప్రచారాన్ని మాత్రమే నమ్మి.. ఆయన ఏపీ బీజేపీ నేతలపై వ్యతిరేకత పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న విషయాన్ని గుర్తించడానికి సిద్ధం కాలేకపోయారు. రెండు పార్టీలు సమన్వయంతో పని చేసి ఉంటే.. ఇప్పటికే ప్రత్యామ్నాయం అయ్యేదని పవన్ ఓ సందర్భంలో చెప్పారు.. అదే నిజం అని.. అసలు సమన్వయంతో పని చేయడానికి ముందుకు రానిదే జనసేన అని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయం
పొత్తుల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హైకమాండ్ నిర్ణయమే తమ నిర్ణయమని చెబుతున్నారు. జనసేన కలసి వస్తే సరే లేకపోతే ఒంటరిపోటీకి అయినా సిద్ధమేనంటున్నారు. దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏను బలోపేతం చేయడానికి ఇతర పార్టీలను ఆహ్వానించినా … తమకేమీ ఇబ్బందిలేదని హైకమాండ్ చెప్పినట్లుగా చేస్తామని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.