ఆయనకు బీజేపీ సహకారం, ఈయనకు పవార్ ఆశీర్వాదం..

వేసవి ముగుస్తున్నప్పటికీ మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి తగ్గడం లేదు. ఏదోక ఎన్నికతో వైరి వర్గాలు బిజీగా ఉంటున్నాయి. ఇటీవలి ఉప ఎన్నికల తంతు ముగిసిన కొద్ది రోజులకే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చన్న చర్చ మొదలైంది. దానితో రెండు ప్రధాన వర్గాలు మళ్లీ రెడీ అవుతున్నాయి..

ఆ ఇద్దరు యువకులు చాలా బిజీ

శివసేన వైరి వర్గాలైన ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మధ్య పచ్చ గడ్డి వేస్తే మండుతోంది. అది ఒక కోణమే. ఇప్పుడు వారి పిల్లలు రంగంలోకి దిగి ఆ పోటీని మరింతగా పెంచుతున్నారు.బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలా సాహెబ్ ఠాక్రే శివసేనను ప్రారంభించినప్పటి నుంచి శివసేన చేతిలో ఉన్న బీఎంసీని ఈ సారి తమ ఖాతాలో వేసుకోవాలని ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన భావిస్తోంది. దానితో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య, ఏక్ నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ తమ తమ పార్టీల తరపున రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టారు.

ఏడాదిపైగా జాప్యం

బీఎంసీ పదవీ కాలం గతేడాది మార్చి 7న ముగిసింది. ఏడాదిపైగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్ కు త్వరలో ఎన్నిలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా షిండే వర్గం శివసేనకు బీజేపి మద్దతిచ్చింది. ఉద్ధవ్ సేనకు ఎన్సీపీ మద్దతివ్వగా, కాంగ్రెస్ ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. మాజీ మంత్రి ప్రస్తుత వోర్లీ ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే కొన్ని రోజులుగా ముంబై నగరమంతా పర్యటిస్తున్నారు. దాదర్ లోని శివసేన భవన్ తో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం మాతోశ్రీలో సీనియర్ నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించి కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని చర్చించారు. ఇక ఆర్థోపెడిక్ వైద్యుడైన డాక్టర్ శ్రీకాంత్ కూడా కల్యాణ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా షిండే వర్గం శివసేన నాయకులతో భేటీ అవుతూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.

బీజేపీ బలమే షిండేకు శ్రీరామరక్ష

నిజానికి క్షేత్రస్థాయిలో షిండేకు అంత బలమేమీ లేదు. ఆ సంగతి ఆయన తనయుడు శ్రీకాంత్ కు కూడా తెలుసు. అందుకే ముంబై మహానగరంలో బీజేపీకి ఉన్న ప్రజాదరణను తమకు అనుకూలంగా మార్చుకుని బీఎంసీ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు. శాఖా సంపర్క్ అభియాన్ పేరుతో ముంబై మహానగరంలో షిండే బలాన్ని పెంచడంతో పాటు స్థానికంగా బీజేపీతో దోస్తీని మరించి పటిష్టం చేస్తున్నారు. తాజా మాజీ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు డాక్టర్ శ్రీకాంత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇదీ ఠాక్రే వర్గానికి ఇబ్బంది కలిగించే అంశమనే చెప్పాలి. ఎందుకంటే కార్పొరేటర్లందరికీ క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి…