మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సారి సునాయాస విజయంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే వ్యూహాలు రచిస్తోంది. ఒక్కో ప్రాంతానికి ఓక్కో నినాదం రెడీ చేస్తోంది.
బుందేల్ ఖండ్, మహాకౌశల్ ప్రాంతాలే కీలకం
రాష్ట్రంలో గెలవాలంటే ఆ రెండు ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే మాటను ప్రతిపక్షం ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని బీజేపీ డిసైడైంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కంటే కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న భారీ స్కీములకు విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ పెద్దలు డిసైడయ్యారు. జనంలో ఉండేందుకు ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.మహాకౌశల్ లో 38 అసెంబ్లీ స్థానాలు, బుందేల్ ఖండ్ లో 26 సెగ్మెంట్లు ఉన్నాయి.
చక చకా పనులు చేస్తున్న ప్రభుత్వం
బుందేల్ ఖండ్, మహాకౌశల్ ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే నాటికి లక్ష్యాన్ని చేరాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది. ఆగస్టు 12న సాగర్ నగరానికి వచ్చిన ప్రధాని మోదీ రూ.100 కోట్లతో నిర్మించే సంత్ రవిదాస్ స్మారకానికి శంకుస్థాపన చేశారు.సంత్ రవిదాస్ సమర్సత యాత్ర ద్వారా బీజేపీ ఇప్పటికే దళితులను ఆకట్టుకునే చర్యలు చేపట్టింది . సంత్ రవిదాస్ కు గుడి కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క ఆగస్టు 12నే కోటా – బీనా డబుల్ రైల్వే లైనును కూడా మోదీ ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీ ఓట్లే లక్ష్యం
ఇటీవలి కాలంలో మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో కూడా బీజేపీ యాత్రలు నిర్వహించింది. విప్లవకారులు బీర్సా ముండ, తాంత్యా మామా బిల్, రఘునాధ్, శంకర్ షాల గుర్తుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దళితులు, గిరిజనులపై ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. రాష్ట్రంలో 22 శాతం మంది గిరిజనులు, 16 శాతం మంది దళిత ఓటర్లున్నారు. రాష్ట్రంలో మొత్తం 47 సీట్లు గిరిజనులకు, 35 సీట్లు దళితులకు రిజర్వ్ చేశారు. కాకపోతే 120 స్థానాలపై వీరి ప్రభావం ఉంటుందని గుర్తించగా, అందులో మహాకౌశల్, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగని ఓబీసీలను విస్మరించిన దాఖలాలు కూడా లేవు. వారిలో వెనుకబాటుతనాన్ని గుర్తించి తగిన సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కులాల పేరుతో కమిషన్ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు బ్రాహ్మణ, బనియా పార్టీగా పేరు పొందిన బీజేపీని అన్ని కులాల పార్టీగా మార్చిన ఘనత మోదీకే దక్కుతుందని చెప్పాలి. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వెనుకబడిన సామాజిక వర్గాలను బీజేపీ అక్కున చేర్చుకుంది. ఎన్నికల లోపు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రెండు ప్రాంతాల్లో వీలైనన్ని పర్యటనలు చేసేందుకు షెడ్యూల్ ఖరారవుతోంది.