లోక్ సభ ఎన్నికలు ఇంకా మూడు నెలలు కూడా లేవు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఆఖరి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. మార్చి ఆఖరున ఎన్నికలు నిర్వహిస్తే బావుంటుందని ప్రధాన పార్టీలు ఎదురు చూస్తున్నాయి. దీని వల్ల పూర్తి వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎన్నికల ప్రక్రియను కానిచ్చే వీలుంటుందని భావిస్తున్నారు.
ఎన్నికల వ్యూహాల్లో కమలం ముందంజ
బీజేపీ మిషన్ 400 దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. అంటే దేశ వ్యాప్తంగా 400 లోక్ సభా స్థానాల్లో విజయం సాధించాలని ఎదురుచూస్తోంది.అందుకోసం రాష్ట్రాన్ని బట్టి తమ వ్యూహాల్లో మార్పులు చేస్తోంది. దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో పార్టీ వ్యూహాలు వేరుగా ఉన్నాయని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే బీజేపీ ఢిల్లీ ఎన్నికల కమిటీ సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించింది.
బలంగా ఉన్నా ఉదాసీనత వద్దు..
2019 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీని ఖంగు తినిపించడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 46.6 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో 56.6 శాతం ఓట్లతో ఏడు స్థానాలను గెలుచుకుంద. కాంగ్రెస్ పార్టీ 22.5 శాతం ఓట్ షేర్ తో రెండో స్థానంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 18 శాతం ఓట్ షేర్ తో మూడో స్థానానికి పరిమితమైంది. ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటే, ఆప్ రెండు నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై ఒక రూట్ మ్యాప్ రూపొందించాలని డిసైడయ్యారు. ఏడు స్థానాలు తమ చేతిలో ఉన్నాయన్న గర్వం వద్దని, కష్టపడి పనిచేసి మళ్లీ ఏడు చోట్ల గెలవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఢిల్లీ పార్టీ యూనిట్ కు హితబోధ చేశారు.
ఒకరిద్దరినీ మార్చడం ఖాయమా ?
బీజేపీ మొత్తం ఒకటై అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 22న జరిగే కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. ప్రధాని మోదీ కూడా అయోధ్య కోసం దీక్షలో ఉన్నారు. 22 వరకు ఆయన్ను డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి..రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ప్రస్తుతం ఉన్న ఎంపీలందరి పనితీరును సమీక్షిస్తుంది. ఈ క్రమంలో ఒకరిద్దరు ఎంపీలను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చే ప్రణాళిక కేంద్ర పార్టీ పరిశీలనలో ఉంది. ఇటీవలి జరిగిన మూడు హిందీ రాష్ట్రాల ఎన్నికల్లోనూ భారీ స్థాయి మార్పులతో ఘనవిజయం సాధించిన బీజేపీ.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల లోక్ సభ ఎన్నికల్లో అదే ఫార్ములాను అమలు చేయబోతోంది….