యూపీ దళిత ఓట్ల కోసం బీజేపీ ప్రణాళిక

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒక వంతయితే.. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలు మరో వంతు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు రెండు ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాకుండానే లోక్ సభ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తోంది. జనంలోకి వెళ్లేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది…

అతి పెద్ద రాష్ట్రంపై కన్ను…

జనాభా పరంగానూ, లోక్ సభ సీట్ల పరంగానూ అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో ఈ సారి కూడా అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడున్న 80 సీట్లలో అధికంగా తన ఖాతాలో వేసుకోవాలంటే దళితుల ఓట్లు అత్యంత ముఖ్యమని కమలం పార్టీ గుర్తించింది. రాష్ట్ర జనాభాలో 22 శాతం ఉన్న దళితుల్లో 66 ఉప కులాలున్నాయి. అందులో మాయావతి కులమైన జాతవ్ ల డామినేషన్ ఉందని చెప్పక తప్పదు. బీఎస్పీ బలపడిన రోజుల్లో దళితులు ఏకమొత్తంగా ఆ పార్టీకి ఓటేసిన మాట వాస్తవం. ఇప్పుడు బీఎస్పీ బలహీనపడుతున్న నేపథ్యంలో దళితులను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం అమలు చేస్తోంది..

పక్షం రోజుల్లో 12 మెగా సదస్సులు…

దళితుల సమస్యలపై చర్చించేందుకు బీజేపీ ఆరు మెగా సదస్సులను ఏర్పాటు చేసింది. అలాగే మహిళా ఓటర్లలో చైతన్యం కోసం మరో ఆరు సదస్సులు నిర్వహిస్తోంది. అక్టోబరు 17, అక్టోబరు 19న రెండు ఎస్సీ సదస్సులు నిర్వహించగా, మరో పది రోజుల వ్యవథిలో నాలుగు సదస్సులకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అక్టోబరు 30న ప్రయాగ్ రాజ్ లో నిర్వహించే సదస్సు అత్యంత కీలకమని భావిస్తున్నారు.అక్కడ దళిత వర్గాలు బీజేపీ వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నాయి. మొత్తం 12 సదస్సులకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హాజరై కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు. దళిత వర్గాలు, మహిళల్లో బీజేపీ పట్ల విశ్వాసాన్ని పెంచే హామీలు ఇస్తున్నారు.

టార్గెట్ పడమటి యూపీ…

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం,దళితులకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ బీజేపీ హయాంలో అలా జరగదని చెప్పడమే అధికార పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కన్షీరాంకు ఒకప్పుడు జరిగిన అవమానాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. దళితులు- అణగారిన వర్గాలకు బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. పడమటి యూపీలో ఎక్కువగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. అక్కడ దళిత జనాభా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పాలి. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత బీఎస్పీ ఓట్ షేర్ బాగా తగ్గుతూ వచ్చింది.2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 12.88 శాతం ఓట్లే వచ్చాయి. పైగా బీఎస్పీ నేతలు క్రియాశీలంగా ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకుని ఏకమొత్తంగా దళిత ఓట్లను తమవైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన….