గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మైనంపల్లి పార్టీ ఫిరాయించడంతో ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గం తయారయింది. ఇప్పటికే ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బీజేపీ క్రమంంగా అక్కడ బలం పుంజుకుంటోంది. దీంతో టిక్కెట్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది.
ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ నేతలు
అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నియోజవర్గంలో బీజేపీ టికెట్ కోసం అధిక సంఖ్యలో పోటీ నెలకొంది. దీంతో ఈ టికెట్ ఎవరిని వరిస్తోందనన్న ఉత్కంఠ కార్యకర్తలు, నేతల్లో కొనసాగుతోంది. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, తాజా కార్పొరేటర్లు ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా టికెట్‌పై స్పష్టత వచ్చే వరకు పోటీ విషయంలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఒక వైపు సైలెంట్‌గానే ఉంటూనే హైకమాండ్ కు తమ పనితీరును వివరించి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ విజయాలు
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం చూపకున్నా గ్రేటర్ ఎన్నికల్లో బలం పుంజుకుంది. మల్కాజిగిరి పరిధిలోని ఆరు డివిజన్లలో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించి సత్తా చాటారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో కూడా బీఆర్ఎస్ అభ్యర్ధులకు నువ్వా? నేనా? అన్నట్లుగా బలమైన పోటీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులు కేవలం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపఽథ్యంలో పార్టీకి పట్టు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్, బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ తదితరులు బలంగా ప్రయత్నిసున్నారు.
సీనియర్లకు ఇస్తే రామచంద్రరావు పోటీ
గతంలో పోటీ చేసిన వారు, ఈసారి టికెట్ ఆశిస్తున్న వారు నియోజకవర్గలో పార్టీ బలం, వ్యక్తిగతంగా తమకు లభించే మద్దతుపై లెక్కలు వేసుకుంటున్నారు. కాగా, పలువురు ఇప్పటికే నియోజకవర్గంలో సర్వే చేయించుకుంటున్నట్లు కూడా సమాచారం. బీజేపీ బలంగా ఉన్న మల్కాజిగిరి టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు నాయకులు జాతీయ నాయకత్వం వరకు వెళ్లి విన్నపాలు చేసుకున్నారు. సీనియర్లకు టిక్కెట్ ఇవ్వదల్చుకుంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఇస్తారని భావిస్తున్నారు.