వెనుకబడిన వర్గాల సంక్షేమమే బీజేపీ ధ్యేయం…

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసే బీజేపీ, ఓబీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ విస్మరించిన వర్గాలకు ప్రత్యేక వసతులు కల్పిస్తూ.. ఆర్థికంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది. మాటలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే చేతలతో ఓబీసీలను పైకి తెచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు….

పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అటాక్…

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఓబీసీల(ఇతర వెనుకబడిన వర్గాలు) సంక్షేమానికి చేటు తెచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.వారి సంక్షేమానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసింది శూన్యమని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లులను కేంద్రం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని మోదీ పేద కుటుంబంలో పుట్టారని బాగా వెనుకబడిన తరగతుల ఇబ్బందులు, పేదలకు కలిగే కష్టాలు ఆయనకు తెలుసని అన్నారు. చారిత్రకంగా చూస్తే వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేదని, కేవలం మాటలతో సరిపెట్టేదని ఆయన ఆరోపించారు. అది చారిత్రక సత్యమని ఆయన అన్నారు.

కాకాసాహెబ్ కలేల్కర్ నివేదిక జాప్యం

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పైకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కాకాసాహెబ్ కలేల్కర్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టిందని అమిత్ షా గుర్తుచేశారు. నివేదికలను బుట్టదాఖలు చేసే తత్వం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన ఆరోపించారు.గ్రామసభల్లో కాసేపు కూర్చుని వస్తే సరిపోతుందని సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాతనే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే మండల్ కమిషన్ నివేదికను అమలు చేశారన్నారు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని వ్యతిరేకించారన్నారు. దేశాన్ని కులపరంగా విభజించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉందని, అందుకే ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.బిహార్ కులగణనను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

నెహ్రూ అతి పెద్ద తప్పిదాలు…

కశ్మీర్‌ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని అమిత్‌ షా మరో సారి ఆరోపించారు. మొత్తం కశ్మీర్ ను గెలుచుకోకుండానే కాల్పుల విరమణ ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. యుద్ధం మరో మూడు రోజులు కొనసాగి ఉంటే.. కశ్మీర్ మొత్తం మనచేతిలో ఉండేదన్నారు. సైన్యం పంజాబ్ ను చేరుకున్నప్పుడు నెహ్రూ కాల్పుల విరమణను ప్రకటించారన్నారు. ఆ తర్వాత పొరపాటు జరిగిందని నెహ్రూ అంగీకరించారని, కానీ అది పొరపాటు కాదని, అతి పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజల బాధలను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లకపోవడం రెండో తప్పిదమని షా అన్నారు. గతంలో జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో 90కి పెంచారు. ఇంతకు ముందు కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్‌ డివిజన్‌లో 47కు, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు 24 స్థానాలను రిజర్వు చేసినట్లు ప్రకటించారు. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 114గా ఉంటుంది