రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 25న జరుగుతుంది. సంకల్ప్ పత్ర్ పేరుతో బీజేపీ ఇప్పుడు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. జేపీ నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టో ప్రస్తుత గెహ్లాట్ నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ప్రధానాంశమైంది. పేపర్ లీక్ సహా అసంఖ్యాక స్కాములకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బిందువైందని ఆరోపిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని స్కాములకు కలుపుకుని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని బీజేపీ తన సంకల్ప్ పత్ర్ లో పేర్కొంది. పార్టీ సంకల్పం బావుందని చెప్పక తప్పదు.
మహిళల కోసం ప్రత్యేక పథకాలు
ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆమె పేరులో రెండు లక్షల రూపాయలను ప్రభుత్వమే డిపాజిట్ చేస్తుందని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తారు. పీఎం మాతృవందన్ కింద సాయం పెంచుతారు. ఇంటర్ లో మంచి మార్కులు వచ్చిన అమ్మాయిలకు ప్రభుత్వం స్కూటర్లు బహూకరిస్తుంది. ప్రతీ జిల్లాలోనూ ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది. ప్రతీ పోలీస్ స్టేషన్లోనూ ఒక మహిళా డెస్క్ ఏర్పాటు చేస్తారు.
పేద పిల్లలకు ప్రత్యేక సాయం..
పేద విద్యార్థులకు ప్రతీ ఏటా రూ.12,500 రూపాయలు సాయం అందించాలని బీజేపీ తీర్మానించింది. దానితో వాళ్లు స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, యూనిఫాంలు కొనుక్కోవచ్చు. ప్రతీ డివిజన్లోనూ రాజస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ ఏర్పాటు చేస్తారు. బామాషా ఆరోగ్య మౌలిక సదుపాయాల పేరుతో రూ.40 వేల కోట్లు వ్యయం చేస్తారు. ఈ క్రమంలో 15 వేల మంది వైద్యులను, 20 వేల మంది పారా మెడికల్ ఉద్యోగులను నియమిస్తారు. గృహ వినియోగానికి 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉంచుతామని బీజేపీ ప్రకటించింది. వృధాప్య పెన్షన్లకు రూ.1,500కు పెంచాతారు. రాజస్థాన్ ఆర్థికరంగాన్ని మళ్లీ గాడిలో పెడతారు. రాష్ట్రాన్ని 350 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని బీజేపీ సంకల్పించింది. జైపూర్, కోటా సహా ఏడు నగరాలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేస్తారు. జైనులు,సిక్కుల పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్టులు వ్యాపారాలు చేసుకునేందుకు నిధులు కేటాయిస్తారు.