లోక్ సభ ఎన్నికలు రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే జరుగబోతున్నాయి. బీజేపీ పట్ల జనంలో పూర్తి నమ్మకం ఏర్పడిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీకి 400పైగా స్థానాలు వస్తాయని ప్రత్యర్థి పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఐనా సరే ఎలాంటి ఉదాసీనతకు అవకాశం ఇవ్వకూడదని బీజేపీ తీర్మానించుకుంది. ప్రజల వద్దకు వెళ్లి తాము ఇంతవరకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మూడో సారి మోదీ అధికారానికి వస్తే చేయబోయే పనులను వివరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంది…
ఠానేలో ఘర్ చలో అభియాన్..
మహారాష్ట్రలో బీజేపీ పోలింగ్ బూత్ స్థాయి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానికి ఘర్ చలో అభియాన్ అని పేరు పెట్టింది. పోలింగ్ కేంద్రం స్థాయిలో పనిచేసే క్రియాశీల కార్యకర్తల్లో కొందరిని ఎంపిక చేసి వారిని ఇంటింటికి పంపిస్తారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వారి ద్వారా ప్రజలకు వివరిస్తారు. మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో తొలుత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ 1,437 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 25 లక్షల మంది ఓటర్లను కలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలిదశగా ఈ కార్యక్రమం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. ఆ రోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మదినం. ఠానే తర్వాత మహారాష్ట్రలోని ఇతర జిల్లాలకు కూడా దీన్ని విస్తరిస్తారు..
ఓటర్లను ఆకట్టుకుంటున్న గావ్ చలో అభియాన్
గ్రామాలకు వెళ్లి మోదీ ప్రభుత్వ స్కీములపై అవగాహన కల్పించే కార్యక్రమానికి గావ్ చలో అభియాన్ అని పేరు పెట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల లబ్ధిదారులే టార్గెట్ గా ఈ కార్యక్రమం జరుగుతోంది. దీని కోసం పార్టీ నేతలకు ఒక వర్క్ షాపు కూడా నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్థి పథంలో నడుస్తుందన్న భావనతో జనంలోకి వెళ్తున్నారు. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 58 శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు…
తెలంగాణలో బీజేపీ గావ్ చలో ..
తెలంగాణ బీజేపీ కూడా గావ్ చలో అభియన్ ప్రారంభించింది. పార్టీ అగ్రనేతలు దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. మండల కేంద్రాల్లో ఇప్పటికే కార్యక్రమం ప్రారంభమైంది. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకోవాలని సందేశం పంపారు.పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎదురు చూస్తున్నారు.