దేశం ఇవాళ ఎలాగుండాలన్నది ఎంత ముఖ్యమో.. భవిష్యత్తులో ఎలా మనుగడ సాగించాలి.. ఏ మేరకు ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లాలన్నది కూడా అంతే ముఖ్యం. దార్శనికుడైన ప్రధాని నరేంద్ర మోదీ .. నిత్యం దేశ భవిష్యత్తుపైనే ఆలోచిస్తుంటారు. దేశంలోని ప్రతీ ఒక్కరి భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష కూడా మోదీ మదిలో మెదులుతోంది. ప్రతీ ఒక్కరి పాత్రను పునర్నిర్వచించాల్సిన అనివార్యతను కూడా ఆయన గుర్తించారు.
ముక్కలు ముక్కలుగా కాదు..సమగ్రంగా….
లోక్ సభ ఎన్నికలు ఐదు దశలు పూర్తవుతున్న వేళ..ప్రధాని మోదీ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అక్కడ తన ఆలోచనా విధానాన్ని, బీజేపీ ప్రభుత్వ ప్రాధమ్యాలను ఆవిష్కరిస్తున్నారు. గత వెయ్యేళ్ల కాలంలో దేశం ఎదుర్కొన్న ఆటుపోట్లను గుర్తించాల్సిన సమయం వచ్చిందన్నారు. వచ్చే వెయ్యేళ్ల కాలంలో ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలన్నారు. అదీ భారత యుగమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సద్వినియోగపరుచుకోవాలన్నారు. ప్రతీ పనిని కాలమానం ప్రకారం విభజించాలన్నారు. ఐదేళ్లు, పదేళ్లు, 25 ఏళ్లుగా విభజిస్తే క్రమంగా వెయ్యేళ్లు పనిచేయగలగమన్నారు. ఈ క్రమంలో కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయని మోదీ అభిప్రాయపడ్డారు… ముక్కలు ముక్కలుగా అభివృద్ధి సాధ్యపడదని, సమగ్రాభివృద్ధే సరైన మార్గమని ఆయన అన్నారు.
వందేళ్ల ప్రజాస్వామ్యంలో చేయాల్సిందేమిటి…?
విజయానికి అడ్డదారులుండవు. కష్టపడాల్సిందే. రహదారిలో ప్రయాణించాల్సిందే. మోదీ ఆలోచనా విధానం కూడా అదే. ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించి త్వరలో వందేళ్లు పూర్తిచేసుకోబోతోంది. అప్పటి కల్లా వెయ్యేళ్ల సమగ్ర కార్యాచరణ సిద్ధం కావాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. యువతలో ఉత్సాహం పెరిగిన సంగతి తనకు కనిపిస్తోందన్నారు. సమీప భవిష్యత్తులో యువతతో కనెక్ట్ కావడమెలాగో చూస్తామన్నారు. సమగ్రాభివృద్ధిపై ఆలోచన చేయాలంటే యువతకు అవకాశాలు పెంచడమొక్కటే మార్గమని ఆయన అన్నారు. వారి అలవాట్లు, ఆలోచనా విధానాల్లో మార్పు రావాలన్నారు.
సునాయాసంగా 400 సీట్లు..
అభివృద్దిలో దేశం పరుగులు తీయాలంటే బ్యూరోక్రసీలో మార్పు రావాలి. ఉద్యోగంలో చేరిపోయి రొటీన్ గా పనిచేసుకుంటూ పోతే సరిపోదు. నియామకం, శిక్షణ, పదోన్నతులపైనే దృష్టిపెడితే సాధించేదీ శూన్యమే. తమ వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటో వాళ్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ప్రధాని మోదీ అంటున్నారు. వారసత్వం, అభివృద్ధి గురించి తాను అనేక పర్యాయాలు ప్రసంగించానని, ఇప్పుడున్న బ్యూరోక్రాట్లు వాటిని బాగా అధ్యయనం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో వచ్చిన ప్రతీ మలుపును అర్థం చేసుకుని బ్యూరోక్రాట్లు పనిచేస్తే వారి జీవితం సార్థకమవుతుందని మోదీ అన్నారు. ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే ఈ సారి ఎన్నికల్లో తమకు భారీ మెజార్టీ ఖాయమన్నారు. గత రెండు ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎెన్డీయేకు 400 సీట్లు దాటటం ఖాయమన్నారు. 400 స్థానాలకు, రాజ్యాంగ మార్పుకు విపక్షాలు ముడిపెడుతున్నాయని, వాళ్లదీ అవివేకమైన ఆలోచనా విధానమని మోదీ ఆరోపించారు. పార్లమెంటులో అర్థవంతమైన చర్చలకు అవకాశం ఇవ్వని విపక్షాలు.. జనంలోకి వెళ్లి మాత్రం విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నాయన్నారు.