దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలోని ఏడు లోక్ సభా స్థానాలు ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్నప్పటికీ … అక్కడి లోక్ సభా స్థానాలు మాత్రం బీజేపీ చేతిలోనే కొనసాగుతున్నాయి. నేషనల్ కేపిటల్ టెరిటరీ పరిధిలోకి వచ్చే ఈ లోక్ సభా నియోజకవర్గాల్లో ఈ సారి ఆసక్తి పెరిగినప్పటికీ అవి బీజేపీ చేయి దాటి పోయే ప్రసక్తే లేదన్న చర్చ జరుగుతోంది.
ఈ నియోజకవర్గం కీలకం…
ఏడు నియోజకవర్గాల్లో కీలకమైనది ఈస్ట్ ఢిల్లీ (తూర్పు ఢిల్లీ ) అని చెప్పొచ్చు. తూర్పు ఢిల్లి జిల్లాతో పాటు షాహధారా జిల్లా పరిధిలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. మొత్తం పది అసెంబ్లీ సెగ్మెంట్లు దీని కిందకు వస్తాయి. యమునా నదికి తూర్పున ఉన్నందున దీనికి ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం అని పేరు వచ్చింది. మొత్తం 16 లక్షల మంది ఓటర్లున్నారు. అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాల వారు ఇక్కడ ఉంటున్నారు…
పోటీకి దూరంగా గౌతం గంభీర్..
2019లో బీజేపీ తరపున మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ … తూర్పు ఢిల్లీలో గెలిచారు. దాదాపు నాలుగు లక్షల మెజార్టీ సాధించారు. ఈ సారి ఆయన పోటీ చేయడం లేదు. 2014లో కూడా బీజేపీ అభ్యర్థి మహేష్ గిరి అక్కడ విజయం సాధించారు. ఈ క్రమంలో ఈస్ట్ ఢిల్లీ బీజేపీ చేతికి వచ్చి పదేళ్లవుతోంది. మే 25న అక్కడ పోలింగ్ జరుగుతుండగా…. బీజేపీ తరపున హర్ష్ మల్హోత్రా, ఆప్ అభ్యర్థిగా కుల్దపీ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ సారి బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ – ఆప్ కాంబినేషన్ లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అంత సీన్ లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. బీజేపీలో కింది స్థాయి నుంచి ఎదిగిన హర్ష్ మల్హోత్రా ఆ ప్రాంతంలో అందరికీ పరిచితుడు కావడంతో ఆయన విజయం సునాయాసమవుతుందని భావిస్తున్నారు….
సమస్యల పరిష్కారమే అజెండా….
నిజానికి అక్కడ కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. మెట్రో కనెక్టివిటీ బాగా పెరిగింది. అయితే రాత్రి పూట సర్వీసులు పెంచాలన్న డిమాండ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ వల్ల దుర్గంధం వ్యాపిస్తున్నా.. మైళ్ల దూరానికి అది అసహ్యంగా కనిపిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది. చెత్త కాల్చడం వల్ల జనానికి ఊపిరాడటం లేదు. 2020 నాటి అల్లర్లు, హింస కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశమైంది. దీనితో ఓటర్లు మత పరంగా విడిపోయారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీధి దీపాలు, రోడ్లు కూడా సమస్యగానే ఉన్నాయి. వజీరాబాద్ కాలువలో జల కాలుష్యం తూర్పు ఢిల్లీ జనాన్ని వేధిస్తోంది. విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాల కొరత కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా జాప్యం తప్పడం లేదు…