దేశంలో తిరుగులేని పార్టీగా ఉన్న బీజేపీ ఏపీలో పొత్తుల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చింది. రెండు రోజుల పాటు పొత్తుల అంశంతో పాటు వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో కీలక సమావేశాలు జరిగాయి. ఇందులో పార్టీ నేతలు లిఖితపూర్వతంగా తమ అభిప్రాయాలు చెప్పారు.
జనసేనతో మాత్రమే పొత్తు
జనసేన పార్టీ ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతోంది. అయితే టీడీపీతో కలిసి పని చేస్తోంది. టీడీపీతో జనసేన కలిసి పని చేస్తున్నా.. తాము బీజేపీతోనే ఉన్నామని చెబుతోంది. ఈ అంశంపై హైకమాండ్ ప్రతినిధులు ఆరా తీశారు. అయితే టీడీపీపై నమ్మకం లేకపోవడం వల్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అలా ఓ ఆప్షన్ పెట్టుకున్నట్లుగా ఉన్నారని ఎక్కువ మంది అభిప్రాయం చెప్పారు. అయితే మిత్రపక్షాన్ని మనం దూరం చేసుకున్నట్లుగా ఎందుకని.. జనసేన పార్టీ తాము కలిసే ఉన్నామంటోంది కాబట్టి మన పార్టీ విధానం కూడా అదేనని తేల్చారు. జనసేన కాదంటే అప్పుడు స్పందించాలని నిర్ణయించారు.
టీడీపీతో పొత్తుపై జరగని చర్చ
తెలుగుదేశం పార్టీతో పొత్తుపై అసలు ఎలాంటి చర్చ జరగలేదు. దేశంలో తిరుగులేని స్థానంలో ఉన్న బీజేపీ ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుల కోసం చర్చలు జరపాల్సిన అవసరం లేదని సమావేశం అభిప్రాయపడింది. ఎవరికైనా పొత్తులు అవసరం అనుకుంటే ఆ పార్టీలు సంప్రదిస్తే తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ హైకమాండ్ సంకేతాలు పంపింది. ఇదే విషయాన్ని సమావేశం అనంతరం బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో పొత్తులఅంశంపై బీజేపీ విధానంపై స్పష్టత వచ్చినట్లయింది.
హైకమాండ్ ప్రతినిధులతో నాదెండ్ల చర్చలు
బీజేపీ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రతినిధులతో చర్చల కోసం… జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వచ్చారు. టీడీపీతో కలిసి వెళ్తున్నందున .. బీజేపీ కూడా రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే తమ వైపు నుంచి ప్రతిపాదన రాదని.. టీడీపీ నేతలతో చెప్పించాలని.. నాదెండ్లకు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. బీజేపీతో పొత్తులు కావాలంటే టీడీపీ నేతలు బహిరంగంగా స్పందించాల్సి ఉందని క్లారిటీ వచ్చినట్లయింది.