తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనన్న సందేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బలంగా తెలంగాణ ప్రజల్లోకి చొప్పించగలిగారు. చేవెళ్లలో జరిగిన ప్రజా సంకల్ప సభలో అమిత్ షా.. సూటిగా తమ పార్టీ విధానాలను ప్రకటించడంతో పాటు.. బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క పరీక్షా సరిగ్గా పెట్టలేని ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని సూటిగా స్పష్టం చేశారు. కీలకమైన ముస్లిం రిజర్వేషన్ల రద్దు హామీ ఇవ్వడం బీఆర్ఎస్కు మింగుడు పడని అంశం.
మతపరమైన రిజర్వేషన్ల ముగింపు హామీ
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. కర్ణాటకలో ఇప్పటికే రద్దు చేశారు. గగ్గోలు దాంతో పాటు రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కీలక మార్పులు చేసింది. ఎస్సీలకు 17శాతం రిజర్వేషన్లు పెంచడంతో పాటు లింగాయత్-వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లు పెంచింది. ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి.. వారిని ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు అందించే పదిశాతం రిజర్వేషన్లో చేర్చింది. ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్ల స్థానంలో.. కొత్త వొక్కలిగ, లింగాయత్ కేటగిరిలు సృష్టించి.. రెండుశాతం చొప్పున రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి , ఎస్టీ రిజర్వేషన్లు 3 నుంచి 7శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మతపరమైన రిజర్వేషన్లతో రాజకీయ లాభం పొందుతున్న బీఆర్ఎస్
ముస్లింలకు రిజర్వేషన్లు ఆశ చూపుతూ సీఎం కేసీఆర్ కొంత కాలంగా రాజకీయాలు చేస్తున్నారు. విద్యా పరంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు (బీసీ-ఈ) 4 శాతమే రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ, వారి జనాభా 12 శాతం కన్నా ఎక్కువ ఉందని.. ఈ క్రమంలో ప్రభుత్వం ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సుధీర్ కమిటీ నియమించారు. ఈ కమిటీ వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వెనుకబడిన ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ తీర్మానం చేశారు. కానీ కేంద్ర ఏరిజర్వేషన్లనూ ఆమోదించలేదు.. కాబట్టి అమల్లోకి రాలేదు. ఇప్పటికీ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీఆర్ఎస్ చెబుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేశారు కానీ.. ముస్లిం రిజర్వేషన్లను పెంచుతూ అలాగే జీవో మాత్రం జారీ చేయలేదు. ఇక్కడే బీఆర్ఎస్ రాజకీయం బెడిసికొట్టింది. ఎందుకంటే.. ముస్లింలకు ఇలా అడ్డగోలుగా రిజర్వేషన్లు పెంచితేం ఏం జరుగుతుందో కేసీఆర్‌కు తెలుసని బీజేపీ వర్గాలంటున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా సాధ్యం కానప్పటికీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. ఇందు కోసం రాజ్యాంగంలో లొసుగుల్ని వాడుకున్నారు. ఓసీ ముస్లింలు.. వెనుకబడిన వర్గాలు అని విభజించారు. నాలుగు శాతం రిజర్వేషన్లను 15 ముస్లిం ఉప కులాలకు వర్తింపజేశారు. అంటే కులాల కోణంలో విభజంచారు. అందులో అచ్చుకట్టల వాండ్లు, అత్తర్ సాయిబులు, ధోబీ ముస్లిం, ఫకీర్, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం, గుడ్డి ఎలుగువాళ్లు, హజామ్, నాయీ ముస్లిం, లబ్బి, పకీర్ల, ఖురేషీ, షేక్, సిద్ది, తురక కాశ, అగ్రవర్ణం కాని ఇతర ఉప కులాలను బీసీ–ఈ జాబితాలో చేర్చి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీనిపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఆ రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. అయితే కులం అనే పదం వాడటంతో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కు గండి !
ముస్లిం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇతర వర్గాల్లో వ్యతిరేకతకు కారణం అవుతాయి. అయితే ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కొన్ని వర్గాలకు మాత్రమే ఆ అవకాశం ఉంది. ఇప్పటికీ ఓసీ ముస్లింలు ఉన్నారు. బాగా వెనుకబడిన వర్గాలను మాత్రమే రిజర్వేషన్ కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు బీజేపీ ఈ మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. వారికి తగ్గించి ఇతరులకు ఇస్తామని చెప్పడం ద్వారా ఇతరులను ఆకట్టుకోవచ్చు.. బీజేపీ మార్క్ హిందూత్వ వాదులనూ ఆకట్టుకోవచ్చు. అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ముస్లిం రిజర్వేషన్ల అంశంపై గట్టిగా మాట్లాడలేదు. మాట్లాడితే ముస్లింల ఓట్లు కొత్తగా వచ్చేది ఏమీ లేదు..ఆ ఓట్లు మజ్లిస్‌కే పడతాయి. మజ్లిస్ పోటీ చేయకపోతే ఆ ఓట్లు బీఆర్ఎస్కు వస్తాయి. అవి రిజర్వేషన్ వివాదం లేకపోయినా వస్తాయి. కానీ అనుకూలంగా మాట్లాడితే మాత్రం.. మెజారటీ వర్గం దూరం అవుతుంది.
అమిత్ షా తెలంగాణలో తమ వ్యూహం ఏమిటో.. చేవెళ్ల సభ ద్వారా ఓ సంకేతం ఇచ్చారని అనుకోవచ్చు.