తమిళనాడులో మళ్లీ వివాదాల అగ్గి రాజుకుంటోంది. కొందరు దుండగుల చర్యల కారణంగా రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమంటోంది. తాజాగా జరిగిన ఓ ఘటనతో డీఎంకే తీరు పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
రాజ్ భవన్ పై బాంబు దాడి…
చెన్నైలోని గిండీలో ఉన్న రాజ్ భవన్ మెయిన్ గేటుపై ఓ దుండగులు రెండు పెట్రోల్ బాంబులు విసిరాడు. గవర్నర్ రవి అధికారిక నివాసంపై దుండగుడు మోలోటోవ్ కాక్ టెయిల్ గా పిలిచే పెట్రోల్ బాంబు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గవర్నర్ కు , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాల నేపథ్యంలో ఈ దాడికి ప్రాధాన్యం ఏర్పడింది. హై సెక్యూరిటీ ఏరియాపైన బాంబు దాడి వెనుక ఉద్దేశమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
గతంలోనూ అదే దుండగుడు..
పెట్రోల్ బాంబు విసిరిన దుండగుడిని భద్రతా సబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.తాజా ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్ విధులకు ఆటంకం కలిగిస్తున్న డీఎంకే మాత్రమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, ఆ పని వారే చేయించారని అన్నామలై ఆరోపించారు. 2022 ఫిబ్రవరిలో చెన్నై బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేసినది కూడా ఆ వ్యక్తేనని అన్నామలై గుర్తు చేశారు. అతను డీఎంకే కార్యకర్తగా అనుమానిస్తున్నామన్నారు. ఇలాంటి వరుస చర్యలతో డీఎంకే తీరు, ఆ పార్టీ నేతల అసహనం బయట పడుతోందన్నారు. అయితే డీఎంకే ఈ ఆరోపణలను ఖండించింది. ఎవరో ఉన్మాది చేసిన పనికి అధికార పార్టీని తప్పు పట్టడం సరికాదని పార్టీ నేతలు అంటున్నారు. గవర్నర్ కు , ప్రభుత్వానికి మధ్య వివాదం వేరే విషయమని, బాంబు దాడి వేరే విషయమని పార్టీ వర్గాలు వివరణ ఇచ్చుకున్నాయి..
స్టేడియంలో జెండా వివాదం…
బీజేపీ, డీఎంకే మధ్య మరో వివాదం కూడా ఇటీవలి కాలంలో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ జట్టు ఛేపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడినప్పుడు డీఎంకే ప్రభుత్వ పోలీసులు, తమిళనాడు క్రికెట్ సంఘం కలిసి భారత అభిమానుల్ని అవమానపరిచారని అన్నామలై ఆరోపించారు. భారత జాతీయ పతాకాన్ని తీసుకెళ్తున్న ఫ్యాన్స్ చేతుల్లోంచి వాటిని లాగేసుకుకుని చెత్త బుట్టలో పడేశారని ఆయన వెల్లడించారు. చెత్త బుట్టలోంచి భారత పతాకాలను బయటకు తీస్తున్న ఫోటోలను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తొలుత సనాతన వివాదం, తర్వాత జెండా వివాదంతో డీఎంకే ప్రభుత్వం భారతీయతను అవమానపరుస్తోందని ఆయన అంటున్నారు. పాకిస్థాన్ జట్టుకు డీఎంకే ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచిందని, అదే టైమ్ లో భారత పతాకాన్ని మాత్రం అవమానపరిచిందని అన్నారు. తమిళనాడు క్రికెట్ సంఘం సహా తమిళనాడు పోలీసులు భారతీయులందరికీ క్షమాపణ చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు. దీనిపై నిరసనోద్యమానికి తమిళనాడు బీజేపీ సిద్ధమవుతోంది.