ఏపీ రాజకీయాల్ని మార్చనున్న బీజేపీ – శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా సభకు భారీ ఏర్పాట్లు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీనే ఇప్పుడు సెంటర్ పాయింట్. బీజేపీ చేసే రాజకీయంపైనే ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు . ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు బీజేపీ చుట్టూ చక్కర్లు కొడుతూండటమే దీనికి నిదర్శనం. అయితే ఏపీలో ఈ సారి ఎవరి ట్రాప్ లో పడకుండా బీజేపీనే కీలక పాత్ర పోషించేలా ఆ పార్టీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ బలం చాటేలా అగ్రనేతల బహిరంగసభలను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మోదీ నవ వసంతాల విజయాలపై ప్రచారానికి ఏపీకి ్గ్రనేతలు

మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కిరణ్‌కుమార్‌ రెడ్డి,సీఎం రమేష్, జీవీఎల్‌ నరసింహా రావు, టీజీ వెంకటేశ్‌, విష్ణువర్ధన రెడ్డి కొద్ది రోజుల నుంచి తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లు చేస్తున్నారు.

జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన నేతలు

శుక్రవారం రాత్రి 11గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు.శ్రీకృష్ణ గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం 10గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుచానూరు రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని చిత్తూరు జిల్లా బీజేపీ నేతలతో సమావేశమౌతారు.సాయంత్రం 3.40 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు.4.30 నుంచి 5.40గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి వెళ్తారు.

భారీ జన సమీకరణ చేస్తున్న బీజేపీ నేతలు

జేపీ నడ్డా సభకు భారీ జన సమీకరణ చేయడానికి బీజేపీ నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి చేస్తున్న ప్రచారంతో .. మోదీ పాలనా విజయాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీంతో స్వచ్చందంగా వచ్చే వారు కూడా ఎక్కువగా ఉంటారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారు. వారందరూ నడ్డా సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. శ్రీకాళహస్తి సభ తర్వాత ముఖ్యనేతలంతా విశాఖపట్నం అమిత్ షా సభ కూ హాజరవుతారు.