రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు దిశగా దూసుకుపోవడమే పార్టీల కర్తవ్యం. ఆ సంగతి బీజేపీకి తెలిసినంతగా ఏ ఇతర పార్టీకి తెలిసి ఉండకపోవచ్చు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వం, అంకిత భావంతో ముందుకెళ్లే కార్యకర్తల బలం ఆ పార్టీని నడిపిస్తోంది. అందుకే కర్ణాటక ఓటమిని కమలనాథులు చాలా సులభంగా జీర్ణించుకోగలిగారు. ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం మునిగిపోలేదని కమలం పార్టీ ఎప్పుడో గ్రహించింది. అందుకే ఇప్పుడు పార్టీని అన్ని ప్రాంతాల్లో మరింత పటిష్టం చేసే పనిలో ఉంది.
మరాఠా దేశంపై ప్రత్యేక దృష్టి
మహారాష్ట్ర పరిణామాలు వేగంగా మారతాయని బీజేపీ గ్రహించి చాలా రోజులైంది. పైగా అక్కడ వరుస ఎన్నికలు వస్తున్నాయి. ముంబై, థానే, పుణె, నాగ్ పూర్ సహా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు అక్టోబరు, నవంబరులో జరగబోతున్నాయి. అందులో గెలిస్తేనే 2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకునే వీలుంటుందని బీజేపీకి తెలుసు. 48 లోక్ సభా స్థానాలతో పడమటి రాష్ట్రాల్లో అది అతి పెద్ద స్టేట్ కావడంతో బీజేపీ దానిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది..
సొంత బలంపై రాష్ట్రంలో అధికారమే ధ్యేయం
బీజేపీ ఇప్పుడు శివసేన చీలిక వర్గంతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అనివార్యంగా ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.తమపై కత్తికట్టిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎదగకుండా చూసేందుకు, శివసేన చేసిన ద్రోహానికి గుణపాఠం నేర్చేందుకు బీజేపీ ఏక్ నాథ్ షిండేకు మద్దతిచ్చింది. నిజానికి ఎవరి మద్దతు లేకుండా సొంతబలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అదే అజెండాతో ముందుకు సాగాలని బీజేపీ భావిస్తోంది.
మహారాష్ట్రాలో నడ్డా టూర్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల మహారాష్ట్ర టూర్ ఇవ్వాళ ప్రారంభమవుతుంది. ముంబై, పుణెలో నడ్డా పర్యటిస్తారు. ముంబై ఘట్ కోపర్ ప్రాంతంలోని దళిత కార్యకర్త కుటుంబంలో భోజనం చేస్తారు. బోరివలి, కండీవలీలో కార్యకర్తలతో మాట్లాడతారు. పార్టీ అక్కడ చాలా పవర్ ఫుల్ గా ఉందని చెప్పక తప్పదు. ఎంపీ, ఎమ్మెల్యలతోనూ నడ్డా విడిగా సమావేశమై బీజేపీని బలోపేతే చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారు. మహారాష్ట్ర పార్టీ కోర్ కమిటీతో కూడా సమావేశమవుతారు. ఇటీవలి కాలంలో పుణె ఉప ఎన్నికలో ఓటమితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) ఎన్నికల్లో ఓటమి, నాగ్ పూర్ శాసనమండలి ఎన్నికల్లో ఓటమిని కూడా సమీక్షిస్తారు..
నడ్డా, మోదీ, అమిత్ షా మదిలో ఉన్నది ఒక్కటేనని, పార్టీని మరింత పటిష్టం చేయాలని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఇకపై నడ్డా ప్రతీ రెండు నెలలకో సారి మహారాష్ట్ర టూర్ కు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ ఓటరును తమ వైపుకు తిప్పుకుని, ఇతర పార్టీకి అవకాశాలు లేకుండా చూడటమే ఇప్పుడు బీజేపీ శ్రేణులముందున్న కర్తవ్యమని నడ్డా నూరిపోస్తున్నారు. అదే బీజేపీ మిషన్ మహారాష్ట్రగా చెప్పుకోవాలి..