బీజేపీ మిషన్ ఫైవ్ స్టేట్స్ ..

మోదీ నాయకత్వం రోజురోజుకు పటిష్టమవుతోంది. లోక్ సభ ఎన్నికలకు కమలం పార్టీ సమాయత్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటోంది. లోటు పాట్లు ఉన్న చోట తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా పటిష్టం చేసుకునే ప్రక్రియను ప్రారంభించిందనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఘనవిజయం సాధించాలంటే అందుకు ముందు శాంపిల్ గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఓ పట్టుబట్టాలని డిసైడైంది. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తోంది.

బూత్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేక దృష్టి

ఈ ఏడాది ఆఖరుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ గెలిచిన పక్షంలో లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు మార్గం సుగమమవుతుంది. పార్టీ ప్రచారం కోసం బూత్ స్థాయి కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు విస్తారక్ లను ఎంపిక చేసే ప్రక్రియ మొదలై చాలా రోజులైంది.

27న మోదీ ప్రసంగం

బూత్ లెవెల్ వర్కర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ నెల 27న ప్రసంగిస్తారు. 543 నియోజకవర్గాలకు చెందిన బూత్ లెవెల్ వర్కర్స్ ను పిలిపించి భోపాల్ లోని మోతీలాల్ నెహ్రూ స్టేడియంలో మీటింగ్ పెడుతున్నారు. దేశంలోని మొత్తం పది లక్షల పోలింగ్ బూతులుండగా అందులో ప్రతీ చోట ఐదుగురు కార్యకర్తలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. 26వ తేదీన తొలుత జేపీ నడ్డా భోపాల్ లోనే బూత్ లెవెల్ వర్కర్స్ ను ఉద్దేశించి మాట్లాడతారు. మరుసటి రోజున మోదీ వారికి దిశానిర్దేశం చేస్తారు.

ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక విధులు

అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని 83 లోక్ సభా స్థానాల నుంచి 400 మంది విస్తారక్ లను ఎంపిక చేశారు. దేశంలోని మిగిలిన 460 లోక్ సభా స్థానాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 2,300 మంది విస్తారక్ లను పట్టుకొచ్చి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వారి సేవలను వినియోగిస్తారు. ఈ ప్రక్రియలో అనేక ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ విశ్వసిస్తోంది. ఇతర రాష్ట్లాల నుంచి వచ్చిన వారు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పనిచేయడంతో తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అదే ఉత్సాహంతో సమర్థంగా పనిచేస్తారని బీజేపీ విశ్వసిస్తోంది. విస్తారక్ లను ఎంపిక చేసిన ప్రక్రియ కూడా అనేక దశల్లో ఇంటర్వ్యూ చేసి నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిజమైన అంకితభావంతో పనిచేసిన వారిని మాత్రమే ఎంపిక చేసినందున ప్రయత్న లోపం లేకుండా పనిచేస్తారన్న విశ్వాసం బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది. పైగా మొత్తం ప్రక్రియ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది.