500 నియోజకవర్గాల్లో బీజేపీ మాస్ కాంటాక్ట్

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. అలాగని పార్టీ చేతులు ముడుచుకుని కూర్చోబోవడం లేదని బీజేపీ నేతలు తేల్చేశారు. దక్షిణాది రాష్ట్రంలో ఓటమిని పక్కన పెట్టేసి మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకు, 2024 లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ దిశగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..

మే 30 నుంచి ర్యాలీలు

బీజేపీ గేరు మార్చి, స్పీడ్ పెంచబోతోంది. మే 30 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు దేశంలో ర్యాలీలు నిర్వహించబోతోంది. రాజస్థాన్ లేదా తెలంగాణలో జరిగే ర్యాలీల్లో మోదీ పాల్గొనబోతున్నారు. అంశాల ఆధారంగా జనంలోకి వెళ్లిపోయి క్షేత్రస్థాయిలో మమేకమయ్యేందుకు బీజేపీ వ్యూహరచన చేసుకుంటోంది. కేంద్రమంత్రులు కూడా అందులో భాగస్వాములవుతారు. పారిశ్రామికవేత్తలు, మాజీ సైనికాధికారులు, క్రీడాకారులను ఓ పక్క కలుస్తూనే, సామాన్య ప్రజలను కలుస్తారు. తక్కువలో తక్కువ లక్షన్నర కుటుంబాలను నేరుగా కలుసుకుని మోదీ పథకాల వల్ల దేశానికి జరుగుతున్న మేలను వివరిస్తారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు..

పబ్లిక్ మీటింగుల్లో పథకాల ప్రస్తావన

గత తొమ్మిదేళ్లుగా మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి వల్ల సామాన్యులను కలిగిన ప్రయోజనాలను వివరించేందుకు ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, పీఎం సమ్మాన్ నిధి, స్వచ్ఛ్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాలు ప్రధాన ప్రచారాస్త్రాలవుతాయి. మే 29 నుంచి తమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 350 లోక్ సభా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయడమే టార్గెట్ గా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ఓడిన స్థానాలే టార్గెట్

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 144 స్థానాలే టార్గెట్ గా పార్టీ కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ఏడాది కాలంగా పార్లమెంటరీ ప్రవాస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పుడా కార్యక్రమాలను వేగం పెంచే దిశగా మరో 16 నియోజకవర్గాలను కలుపుకుని 160 చోట్ల నిర్వహించాలని డిసైడైంది. ఒక్కో కేంద్ర మంత్రికి కొన్ని నియోజకవర్గాలు కేటాయిస్తూ పక్షం రోజులకు ఒక సారి అక్కడ పర్యటించడంతో పాటు ఒక రాత్రి అక్కడే బస చేయాలని అధిష్టానం ఆదేశించింది.

కర్ణాటక ఎన్నికలు నేర్పిన పాఠమే…

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే కేంద్ర పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, వాటిని విస్తరించడంతో పాటు, విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ తీర్మానించింది. ఎందుకంటే పథకాల వల్ల లబ్ధి పొందిన వారిలో 50 శాతం పైగా బీజేపీకి ఓటెయ్యగా, పథకాలతో లబ్ధి పొందని వారిలో 54 శాతం మంది కాంగ్రెస్ కు ఓటేశారు. దానితో కేంద్ర పథకాలను జనానికి సమర్థంగా చేర్చ గలిగితే లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది..