అన్నాడీఎంకేకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ…

aiadmk-bjp

విపక్షాలు ప్రతీ అంశానికి అధికారపార్టీపై దుమ్మెత్తిపోస్తుంటాయి. ప్రతిపక్షాల ఐక్యతతో అధికార పార్టీని దించెయ్యాలనుకుంటాయి. దానితో ఏలిన వారికి కొంత టెన్షన్ ఉండే మాట మాత్రం నిజం.. విపక్ష మిత్రపక్షాల దూకుడును ఎలా ఎదుర్కోవాలా అన్న ఆలోచనలో అధికార పార్టీ తలమునకలై ఉంటుంది. తమిళనాడులో మాత్రం పరిస్థితి కాస్త విరుద్ధంగా ఉంది. జాతీయ పార్టీ బీజేపీ దూకుడుకు మిత్రపక్షం అన్నాడీఎంకే బెంబేలెత్తిపోతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వేగాన్ని అన్నాడీఎంకే నాయకుడైన మాజీ సీఎం ఏడపాటి పళణిస్వామి అందుకోలేకపోతున్నారు..

డీఎంకే ఫైల్స్ విడుదల చేసిన అన్నామలై

ఎన్నిరకాలుగా అధికారపార్టీని కార్నర్ చేయాలో తెలుసుకున్న బీజేపీ తమ గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. డీఎంకే ఫైల్స్ పేరుతో అధికార పార్టీ అక్రమాలను బయటపెట్టేందుకు అన్నామలై ప్రయత్నించారు. తొలి విడత డీఎంకే ఫైల్స్ బయటకు రావడంతో అధికారపార్టీ కొంత డిఫెన్స్ లో పడిపోయిన మాట వాస్తవం. అవినీతి సొమ్ముతో డీఎంకే నేతలు రూ.1,34 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని అన్నామలై ఆరోపించారు. స్టాలిన్ తనయుడు ఉదయనిధి, సీఎం అల్లుడు సబరేశన్, స్టాలిన్ సోదరి కణిమొళి, మంత్రులు వేలు, నెహ్రూ, ఎంపీలు టీఆర్ బాలు, కార్తీక్ అనంద్ తో సహా పన్నెండు మందికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని బీజేపీ ఆరోపించారు. పైగా స్టాలిన్ స్వయంగా చెన్నై మెట్రో రైల్ కాంట్రాక్టర్ నుంచి రూ. 200 కోట్లు ముడుపులు పొందారని కూడా బీజేపీ ఆరోపించింది. డీఎంకే పెద్దలు నిర్వహించే కాలేజీల ఆస్తులు రూ. 35 వేల కోట్లకు పైమాటేనని చెప్పారు.భూములను కబ్జా చేసి విద్యాసంస్థలు నిర్మించారన్నారు..

జవాన్ హత్య వివాదం

పడమటి ప్రాంతం కృష్ణగిరిలో జరిగిన జవాను హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వేలంపట్టి అనే ప్రాంతంలో ఆర్మీ జవాను ప్రభుకు, డీఎంకే కార్యకర్త చిన్నస్వామికి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అంతే చిన్నస్వామి ఇంటికి వెళ్లి జనాన్ని తీసుకొచ్చి ప్రభుపై దాడి చేయడంతో అతని చనిపోయాడు. ఇదీ డిఎంకే రౌడీతనానికి, అరాచకవాదానికి పరాకాష్ణ అని తమిళనాడు బీజేపీ మాజీ సైనికోద్యోగుల విభాగం అధ్యక్షుడు బీబీ పాండ్యన్ ఆరోపించారు. గన్స్, బాంబ్స్ ఉపయోగించే స్థాయికి తమను రెచ్చగొట్టవద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినందుకు గానూ పాండ్యన్ పై కేసు నమోదైంది. అయినా తగ్గేదేలే అంటున్న పాండ్యన్.. బాంబులు వేస్తామన్న హెచ్చరికకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. ఇలాంటి ప్రకటనలు బీజేపీ సైలెంట్ సమర్థకులకు జోష్ ని ఇచ్చాయి. వాళ్లిప్పుడు ఆ పార్టీకి బహిరంగ మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

తమిళిసై టైమ్ నుంచే దూకుడు

ప్రస్తుత తమిళనాడు గవర్నర్ డాక్టర్ తమిళిసై ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. అప్పటి నుంచే తమిళ రాజకీయాల్లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇక మాజీ ఐపీఎస్ అన్నామలైకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని అప్పగించిన తర్వాత రాజకీయం వేరే లెవల్ కి వెళ్లిపోయింది. రోజు వారీ వీధిపోరాటాలు, అధికార పార్టీపై ఆరోపణల పర్వం కొనసాగిస్తోంది. తొలి విడత డీఎంకే ఫైల్స్ విడుదల చేసిన అన్నామలై, త్వరలో మలివిడతకు రెడీ అవుతున్నారు.

అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు

ఎంజీఆర్, జయలలిత హయాంలో తిరుగులేని పార్టీగా ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు ఉనికి కోసం ఆరాట పడుతోంది. పళణిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులుగా విడిపోయి నేతలు కొట్లాడుకుంటున్నారు. పన్నీర్ ను పార్టీలో లేకుండా చేయాలని పళణిస్వామి వర్గం ప్రయత్నిస్తోంది. నేతలు ఇప్పుడు పరస్పర విమర్శలకే అవకాశం ఇస్తూ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు. దానితో 234 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకే కంటే, కేవలం నలుగురున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వర్తిస్తోంది..

ఒంటరిపోరుకు అన్నామలై మొగ్గు

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో ఇకపై ఒంటరిపోరు సాగించాలని అన్నామలై, తమిళనాడు బీజేపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు నూరిపోస్తున్నారు, 1998 నుంచి అడపా దడపా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకూడదని ఆయన వాదిస్తున్నారు, ఒకరి పంచనే ఉంటే పార్టీ ఎదిగే అవకాశాలు లేవని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుతో కొత్త ఆరంభానికి శ్రీకారం చుడతామని ఆయన చెబుతున్నారు. దీనితో అన్నాడీఎంకేకు కొంత భయం పట్టుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే హిందూ సంస్థల కార్యకర్తలు తమకు పనిచేస్తారని భావించిన పళణిస్వామికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది. పైగా జనంలోకి వెళితే పళణిస్వామి కంటే అన్నామలైకే ఎక్కువ మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మంచి వక్త. జనంపై సమ్మోహనాస్త్రాలు సంధించగలరు…