టిప్పు సూల్తాన్ పేరుతో రాజకీయ చిచ్చు – వైసీపీ తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం !

ప్రొద్దుటూరులో కొన్నాళ్ల కిందట ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని హడావుడి చేశారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించి… ఉద్యమం చేయడంతో ఆ ప్రతిపాదనపై వెనక్కి తగ్గారు. కానీ వైసీపీ ఇలాంటి మత చిచ్చు రాజకీయాలను పెట్టేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సారి అనంతపురంలో అలాంటి ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది.

అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

అనంతపురం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు డిప్యూటీ మేయర్ కోవటం విజయ భాస్కర్ రెడ్డి భూమిపూజ చేశారు. టిప్పు సుల్తాన్ ట్రస్టు దీన్ని నిర్మిస్తోంది. బిజెపి, బిజెపి అనుబంధ సంఘాలు ఈ భూమి పూజను తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందూ సంస్కృతిని రూపుమాపేందుకు టిప్పు సుల్తాన్ హిందువులపై దాడి చేశారని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడం ఏంటని బిజెపి అనుబంధ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

అసలు టిప్పు సుల్తాన్ ఎవరో వైసీపీ నేతలకు తెలుసా ?

చరిత్ర తెలియకుండా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని బిజెపి మండిపడుతోంది. గత చరిత్రలో టిప్పు సుల్తాన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందూ మహిళలపై అత్యాచారాలు చేశాడని.. మతం మారాలని హుకుం జారీ చేసి హిందువులను తీవ్రంగా హింసించాడని చెబుతున్నారు. మతం మారకపోతే చావే శరన్యామని వ్యవహరించిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావితరాలకు ఎలాంటి సంస్కృతి నేర్పిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. నగరంలో విగ్రహ ఏర్పాటు పై వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పకుండా విగ్రహాన్ని పగలగొట్టి తీరుతామని బీజేపీ , అనుబంధ సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.

ఉద్దేశ పూర్వక రాజకీయ కోసమేనా ?

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై డిప్యూటీ మేరు కూడా వెనక్కి తగ్గేదే లేదని మేయర్ ప్రకటించారు.ఈ అంశం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విగ్రహ ఏర్పాటు విషయంలో ఏకంగా డిప్యూటీ మేయర్ ఇంటిని బిజెపి అనుబంధ సంఘాలు ముట్టడించాయంటే ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బిజెపి , బిజెపి అనుబంధ సంఘాలు ఆది నుంచే దేశంలో ఎక్కడా టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని మొదటి నుంచే వారు ఈ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయినా కావాలనే చేస్తున్నారంటే.. రాజకీయ దురుద్దేశం ఉందని బీజేపీ భావిస్తోంది. హిందూవులను కించ పరిచే ప్రయత్నమేనని .. పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఈ వివాదం దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.