ఉత్తరాదిన బీజేపీదే హవా…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ అలా పెరిగిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయని ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల జనం వేచి చూశారు.తెలంగాణలో పోలింగ్ శాతం, పోలింగ్ సరళి కంటే కూడా రాష్ట్రం సహా ఐదు చోట్ల ఎవరు గెలుస్తారన్న ప్రశ్నలు ఎక్కువ మందిని వేధించిన మాట వాస్తవం. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేల్చిన సర్వేలు రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి జనం పట్టం కడతారని నిర్థారించాయి.

మధ్యప్రదేశ్లో క్లియర్ మెజార్టీ..

మధ్యప్రదేశ్ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా జరిగాయి. మధ్యలో ఏడాదిన్నర మినహా రెండు దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న బీజేపీని ఓడించడం సాధ్యమా అన్న ప్రశ్నల నడుమే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కొన్ని పోల్స్ కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్పగా, కొన్ని బీజేపీ గెలుపును సూచించాయి. ఫైనల్ గా ఎన్డీటీవీ విశ్లేషించి, ప్రచురించిన పోల్ ఆఫ్ పోల్స్.. మధ్యప్రదశ్లో బీజేపీకే స్పష్టమైన మెజార్టీ ఇచ్చాయి. తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ సగటును తీసుకుంటే 230 మంది ఎమ్మెల్యేలుండే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 124 స్థానాలు వచ్చాయి. ఆ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఖాయమైంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ 102 స్థానాలకు పరిమితమై మళ్లీ విపక్షంలో కూర్చోక తప్పదని తెలుస్తోంది. కొన్ని సర్వేలు టైట్ రేస్ ఖాయమని అంటున్నా.. పోల్ ఆప్ పోల్స్ మాత్రం బీజేపీకి క్లియర్ మెజార్టీ ఇస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు మరో అవకాశం వస్తే.. బీజేపీలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతకు కూడా పొందుతారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత లేదని కూడా తేలిపోయింది.

రాజస్థాన్లో కమల వికాసం

ప్రతీ ఎన్నికలోనూ అధికారం మారే రాజస్థాన్లో ఈ సారి కూడా అదే రివాజును కొనసాగిస్తూ బీజేపీకి అధికారం దక్కడం ఖాయమని పోల్ ఆప్ పోల్స్ చెబుతోంది. 200 స్థానాల్లో 199 చోట్ల పోలింగ్ జరిగిన ఎడారి రాష్ట్రంలో బీజేపీకి 104 స్థానాలు దక్కే వీలుంది. కాంగ్రెస్ పార్టీ 85 స్థానాలకు పరిమితమై ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటుంది. తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ లో ఏడు బీజేపీకి స్పష్టమైన మెజార్టీనివ్వగా, రెండు మాత్రమే కాంగ్రెస్ పక్షం వహించాయి. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని కూడా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం

ఉత్తర, మధ్య భారతంలో చత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంగా పరిణమించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది. 90 మంది ఎమ్మెల్యేలుండే అసెంబ్లీలో 46 మెజార్టీ మార్కు కాగా, హస్తం పార్టీకి 49 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ చెబుతోంది. బీజేపీ 38 స్థానాల వరకు సాధించే వీలుంది. కొంత మేర ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ అది కాంగ్రెస్ ను ఓడించే స్తాయిలో లేదని నిర్థారణ అయ్యింది.