ఆ 200 సీట్లపై బీజేపీ గురి…

మూడు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీజేపీలో జోష్ నిండిపోయింది. కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతిన్నదని కమలనాథులకు విశ్వాసం కలిగింది. ఇప్పుడు 2024లో పార్టీ విజయమే ప్రాతిపదికగా పనిచేయాలని తీర్మానించారు. హిందీ బెల్డులోని కీలక రాష్ట్రాలతో పాటు గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తోంది..

ఐదు రాష్ట్రాలే కీలకం

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో విజయంతో అత్యధిక రాష్ట్రాలను బీజేపీ ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది. మూడు రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయని చెప్పక తప్పదు. కర్ణాటక, తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతోందని తాజా లెక్కలు చెబుతూనే ఉన్నాయి. 2024లో దక్షిణాదిని చూసుకుంటూనే ఉత్తరాదిలో గరిష్టంగా సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు గెలిచిన మూడు రాష్ట్రాలతో పాటు అత్యధిక లోక్ సభా స్థానాలుండే ఉత్తర ప్రదేశ్, ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో భారీగా సీట్లు స్వాధీనం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో కలిపి 106 లోక్ సభా స్థానాలున్నాయి. ఐదు రాష్ట్రాలు కలిపి 200 సీట్లు ఉంటే.. కనిష్టంగా 190 పొందాలని బీజేపీ భావిస్తోంది.

ఓబీసీ, ఎస్సీ సీట్లలో పెరిగిన బీజేపీ బలం…

ఒకప్పుడు బీజేపీకి అగ్రకులాల పార్టీ అన్న పేరు ఉండేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అన్ని వర్గాల పార్టీగా కమలానికి పేరు వచ్చింది. ఉత్తర ప్రదేశ్లో ఓబీసీలు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చినందుకే వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి అక్కడి 80 స్థానాల్లో 62 వచ్చాయి. యాదవులు కాని ఓబీసీలు, జాదవ్ లు కాని ఎస్సీలు బీజేపీకి మద్దతివ్వడం ప్రారంభించి దాదాపు పదేళ్లవుతోంది. ఆ రెండు సామాజిక వర్గాలు మాత్రం ఎస్సీ, బీఎస్పీలను సమర్థిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివాసీ ఓటర్లు బీజేపీని సమర్థిస్తున్నారు..

మోదీ, షా నాయకత్వమే బలం..

వాళ్లిద్దరూ అహర్నిశలు పనిచేసే నేతలు. 2023లో గెలిచాం కదా అని 2024ను లైట్ గా తీసుకునే టైపు కాదు.విజయం సాధించిన మొదటి రోజు నుంచే వాళ్లు పనులు ప్రారంభించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రధాని మోదీ స్వయంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే తమ ధ్యేయమని వారికి నూరి పోశారు. కేంద్ర హోం మంత్రిగా ఉంటూనే క్షేత్రస్థాయిలో పనిచేయగల నాయకుడు అమిత్ షా. మారు మూల ప్రాంతాలకు సైతం వెళ్లిపోయి పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే ఓపిక ఉన్న నాయకుడు ఆయన. పైగా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం ఆ ఇద్దరు నేతలు వెనుకాడరు.పనితీరును అంచనా వేసి ఆఖరి రోజుల్లోనైనా అభ్యర్థులను మార్చివేసి గెలుపు గుర్రాలకు సీట్లివ్వగలరు. తాజా ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అదే జరిగింది. ఘనవిజయానికి అవకాశం ఇచ్చింది.