రాష్ట్రాన్ని బట్టి బీజేపీ వ్యూహం మారుతుంది. అగ్రనేతల నుంచి పార్టీ శ్రేణుల వరకు ఒకటిగా పనిచేసి బీజేపీని గెలిపించుకుంటారు. ఉత్తర, పడమటి రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. ఇప్పుడు మిషన్ కర్ణాటకలో కూడా వ్యూహాన్ని బీజేపీ పాటిస్తోంది. ప్రచారం ముగిసే వరకు కన్నడ దేశంపైనే దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు డిసైడయ్యారు. మోదీ అక్కడ సుదీర్ఘ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెద్దలు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గెలుపు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. దానితో గతంలో జరిగిన తప్పులు కూడా తెలుస్తున్నాయి.
ఆ 17 నియోజకవర్గాలే కీలకం..
2018 ఎన్నికల్లో తక్కువ మార్జిన్ తో ఓడిపోయిన స్థానాల్లో బీజేపీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాంటి స్థానాలు 17 ఉన్నాయని గుర్తించింది. మూడు వేల కంటే తక్కువ తేడాతో కమలం పార్టీ పరాజయం పాలైన నియోజకవర్గాలు అవి. గత ఎన్నికల్లో 104 స్థానాలు దక్కించుకున్న కమలనాథులు, ఆ 17 కూడా గెలిచి ఉంటే మెజార్టీ సాధించే వారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపేవారు. అందుకే ఇప్పుడు ఆ 17 నియోజకవర్గాలపై ఎక్కువ ఏకాగ్రత చూపాలని పార్టీ రాష్ట్ర నేతలను అధిష్టానం ఆదేశించింది.
ముందే సమీక్షించిన అమిత్ షా
ఈ ఏడాది జనవరిలో కర్ణాటక ఎన్నికల ఏర్పాట్లపై అమిత్ షా సమీక్షించినప్పుడు రాష్ట్ర నాయకుల ఉదాసీతనపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. యువ నాయకులను తయారు చేయడంలో కర్ణాటక పెద్దలు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం చెందారు.. గెలుపు గుర్రాలు కాని కొందరు పెద్దలను నెత్తికెత్తుకుంటున్నారని కూడా ఆయన క్లాస్ తీసుకున్నారట. ఎన్నికల అంశాలేమిటో కూడా గుర్తించకపోతే ఎలా అని నిలదీశారట. దానితో పద్ధతి మార్చుకుని అంకిత భావంతో పనిచేసిన రాష్ట్ర శాఖ ఇప్పుడు గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. కొందిరు నేతలకు టికెట్లు ఆపేశారు. వారు అలిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని డిసైడయ్యారు.
అన్ని ప్రాంతాలపై సమదృష్టి
విపక్షాల కంచుకోటలను బద్దలు కొట్టేందుకు వ్యూహాలు అమలు చేయడం లేదని ఆగ్రహం చెందిన వ్యూహకర్త అమిత్ షా.. ఆ దిశగా అడుగులు వేశారు. అప్పుడే సొంత మెజార్టీ వస్తుందని కూడా ఆయన లెక్కగట్టారు. ఉత్తర, మధ్య ప్రాంతాల్లో శక్తిమంతమైన లింగాయత్ సామాజిక వర్గాన్ని మంచి చేసుకుని ఓట్లు బ్యాంకులను పెంచుకునే వ్యూహం సక్సెస్ అయ్యిందనే తాజా సర్వేలు చెబుతున్నాయి. తీర ప్రాంత జిల్లాలో బీజేపీ బలం పెంచే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న ఆరెస్సెస్ ఆ దిశగా సక్సెస్ సాధించినట్లేనని చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కలిగ ప్రాబల్యమున్న ఓల్డ్ మైసూరు ప్రాంతమే బీజేపీకి పెద్ద సమస్యగా ఉంది. అక్కడి 61 స్థానాల్లో బీజేపీ ఎన్నడూ 11 మంది ఎమ్మెల్యేలకు మించలేదు. అందుకే కొంతకాలంగా సీనియర్ నేతలంతా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు . ప్రత్యర్థి పార్టీలు ప్రజలకు ఏమీ చేయడం లేదని, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని బీజేపీ చేసిన ప్రచారం జనంలోకి బాగానే చేరిందని చెబుతున్నారు. ఒక్కళిగ నాయకులైన శోధా కరంద్లాజే, సీటీ రవి, అశ్వత్ నారాయణ్ కు పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం కూడా కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు..
లింగాయత్ – బ్రాహ్మణ కాంబినేషన్
ఒక్కళిగలను మాత్రమే మంచి చేసుకుంటే సరిపోదని బీజేపీ గుర్తించి చాలా రోజులైంది. అందుకే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయే సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి పెట్టింది. ఒక్కళిగలను ప్రసన్నం చేసుకునేందుకు బెంగళూరు విమానాశ్రయంలో కెంపే గౌడ విగ్రహం పెట్టినట్లే… ఇతర కులాలను కూడా అక్కను చేర్చుకుంటోంది. అందుకు లిబ్రా.. అంటే లింగాయత్, బ్రాహ్మణ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ ను ఎత్తివేసి అది లింగాయత్ లకు ఇతర వెనుకబడిన వర్గాలకు సర్దుతామని చెబుతోంి. 47 మంది ఒక్కళిగలను, 68 మంది లింగాయత్ లను, 37 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలను ఎన్నికల బరిలోకి దించడం ద్వారా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ చెప్పుకుంటోంది..