లోక్ సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని రాష్ట్రాల్లో సత్తా చాటాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఆ దిశగా కేంద్ర నాయకత్వం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. రాష్ట్ర శాఖలను సమాయత్తం చేస్తోంది. ప్రతీ రాష్ట్రం ముఖ్యమేనన్న సందేశాన్ని కార్యకర్తలకు చేర్చుతోంది. సందేశ్ ఖళీ ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్ పై అధినాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
మార్చిలో బెంగాల్ రాష్ట్రానికి మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర శాఖ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. మార్చి మొదటి వారంలో మోదీ మూడు రోజుల పాటు బెంగాల్ లో మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ లో ఆయన మార్చి 6న ఒక సభలో పాల్గొంటారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల అరాచకానికి కేంద్ర బిందువైన సందేశ్ ఖళీకి ఆ ప్రాంతం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతకముందు ఆరంబాగ్ లో మార్చి 1న, కృష్ణా నగర్లో మార్చి 2న సభలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి..ఆరంబాగ్ సీటులో బీజేపీ కేవలం 1,142 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కృష్ణనగర్ సీటును తృణమూల్ కు చెందిన మహువా మొయిత్రా గెలుచుకున్నారు. ఇటీవలే ఆమెను పార్లమెంటు నుంచి బహిష్కరించారు.
బరాసత్ సమావేశమే కీలకం
బరాసత్ లో ప్రధాని మోదీ పాల్గొనే ర్యాలీ ఈ సారి ఎన్నికలకు అత్యంత కీలకమవుతుందని భావిస్తున్నారు. సందేశ్ ఖళీ ప్రజల సమస్యలను, తృణమూల్ కాంగ్రెస్ గూండాల చేతిలో వాళ్లు పడుతున్న బాధలను మోదీ ప్రస్తావిస్తారు. మహిళలపై జరిగిన అత్యాచారాలను గుర్తు చేస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ వారి పనిపడతామని హెచ్చరిస్తారు. బీజేపీ నేతలపై జరిగిన దాడులను సైతం ఆయన ప్రస్తావిస్తారు. ఫిబ్రవరి 9 నుంచి సందేశ్ ఖళీలో నిరసనలు జరుగుతున్నాయి. ఆ దీవులో గిరిజన, ఆదివాసీ తెగల భూములను తృణమూల్ నేతలు ఆక్రమించుకున్న సంగతి దేశం మొత్తానికి తెలిసిపోయింది. వీటన్నింటికీ కారణమైన షాజహాన్ ఇంకా పరారీలోనే ఉన్నారు.
కోల్ కతాలో తృణమూల్ ర్యాలీ…
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు వచ్చే లోపు షాజహాన్ పోలీసులకు లొంగిపోతారని అంటున్నారు. అప్పుడు తృణమూల్ పై విమర్శల తీవ్రత తగ్గే అవకాశాలుంటాయి. అరెస్టయ్యారు కదా అని సమర్థించుకునేందుకు తృణమూల్ కు ఛాన్సుంటుంది. అలా కాకుండా ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని తృణమూల్ అనుకుంటే మాత్రం పూర్తిగా డిఫెన్స్ లోకి పడిపోవడం ఖాయమని చెబుతున్నారు. మరో పక్క బీజేపీకి కౌంటర్ గా తృణమూల్ కాంగ్రెస్ నేతలు కోల్ కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో మార్చి 10న ఒక ర్యాలీ నిర్వహించబోతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తమ రాష్ట్రానికి నిధులు నిలిపివేసిందని, రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రచారం చేయబోతున్నారు. పైగా దీనికి సంబంధించి ఒక షార్ట్ ఫిలిం కూడా ప్రదర్శించబోతున్నారు. అయితే ఇదంతా దృష్టి మళ్లించే చర్య మాత్రమేనని .. సందేశ్ ఖళీ వ్యవహారం ప్రస్తావనకు రాకుండా నాటకమని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది..