బీజేపీ హైకమాండ్ మైండ్ గేమ్ – ఏపీ ప్రాంతీయ పార్టీలకు చుక్కలు

భారతీయ జనతా పార్టీతో ఆడుకోవాలనుకున్న ప్రాంతీయ పార్టీలకు బీజేపీ హైకమాండ్ చుక్కలు చూపిస్తోంది. ఏపీ లో ప్రాంతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలంతా బీజేపీ హైకమాండ్ వద్ద కు పరుగులు పెడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు మేము మీ మిత్రులం.. మేము మీ మిత్రులమని చెప్పుకునేందుకు వెంట పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఏపీ ముఖ్యనేతలంతా అదే్ పనిలో ఉన్నారు.

ఏపీ రాజకీయాల రింగ్ మాస్టర్ బీజేపీ

ఏపీలో భారతీయ జనతా పార్టీ రింగ్ మాస్టర్ గా మారింది. అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఎవరూ బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీజేపీతో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ కూటమిలో చేరకపోయినా టీడీపీ కంటే నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటామని సంకేతాలు పంపుతోంది. జనసేన కూటమిలోనే ఉన్నామంటోంది.

ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ ప్రయత్నం

బీజేపీతో పొత్తులపై టీడీపీ ఇప్పటి వరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్డీఏలో చేరే అంశంపైనా స్పందించలేదు. గతంలో ఓ సారి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఢిల్లీ వెళ్లి వారిద్దరితో సమావేశం అయ్యారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల వివరాలు బయటకు రాలేదు. కేంద్రంలో వచ్చే సారి కూడా బీజేపీ గెలవడం ఖాయమని అంచనా వేస్తున్న సమయంలో బీజేపీ మద్దతు అవసరమని భావించి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పవన్ కూడా వెళ్లనున్నారు. అయితే చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత.. ఎం జరిగిందో బయటకు రాక ముందే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లారు.

అన్ని పార్టీలనూ గుప్పిట్లో ఉంచుకోవడమే బీజేపీ వ్యూహం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఖరారైందని ఆయనకు సమాచారం వచ్చింది. అయితే అమిత్ షాతోనూ కలుస్తారు. జగన్ అజెండా రాజకీయమేనని చెప్పాల్లిన పని లేదు. లోపల ఏం చర్చిస్తారు.. టీడీపీ, బీజేపీ కలవకుండా చేయగలుగుతారా అన్నది తర్వాత విషయం. కానీ రాజకీయం మొత్తం బీజేపీ తమ చుట్టూనే తిప్పుకుంటోందని స్పష్టమవుతోంది. ఏపీలో ఇరవై ఐదు లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే మద్దతుగా ఉంటాయి. అందుకే బీజేపీ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.