శేరిలింగంపల్లి రాజకీయం కాషాయమయం అయింది. ఒకప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్, టిడిపిల మధ్యే పోటీ ఉండేది. 2014 శాసన సభ ఎన్నికల వరకూ ఈ రెండు పార్టీలదే హవా కొనసాగేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టిఆర్ఎస్ ప్రభావం కనిపించినా శేరిలింగంపల్లిలో మాత్రం టిడిపి భారీ మెజారిటీ సాధించడం ఈ ప్రాంతంలో ఆ పార్టీ ప్రాభవాన్ని తెలియజేసింది. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోగా, టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను దాటి రెండవ స్థానాన్ని సంపాదించింది.
టీడీపీతో పొత్తు వదులుకుని క్రమంగా బలపడ్డ బీజేపీ
2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని 10 డివిజన్లలో జెండా ఎగురవేసిన టిఆర్ఎస్ అగ్రస్థానాన్ని చేరి టిడిపిని రెండవ స్థానానికి పరిమితం చేసింది. ఈ ఎన్నికల్లో సైతం పొత్తు కారణంగా బీజేపీ గచ్చిబౌలి డివిజన్లో మాత్రమే పోటీ చేసి రెండవ స్థానాన్ని సాధించింది. అనంతరం 2018 శాసనసభ సాధారణ ఎన్నికల్లో సైతం టిఆర్ఎస్, టిడిపి-కాంగ్రెస్ కూటమిల మధ్య మాత్రమే పోటీ కొనసాగినప్పటికీ అనూహ్యంగా తెరపైకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, మంజీరా సంస్థల అధినేత గజ్జల యోగానంద్ 22 వేల పైచీలుకు ఓట్లు సాధించారు. 2019 చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బి.జనార్దన్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి దాదాపు 50 వేల ఓట్లు పొందాడు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో రెండోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరడంతో శేరిలింగంపల్లి లోని ఆ పార్టీ బలం పుంజుకుంటు వచ్చింది.
ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన బీజేపీ
నియోజకవర్గంలో దశాబ్ధాల తరపడి పార్టీ కోసం సేవలందిస్తున్న పాత బీజేపీ నేతలు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా, వరదసాయం వైఫల్యంపై చేసిన పోరాటాలు ప్రజల్లో బిజెపికి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. అదేవిధంగా దుబ్బాకలో పార్టీ విజయం సైతం శేరిలింగంపల్లిలో జిహెచ్ఎంసి ఎన్నికలపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలోనే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న బీజేపీ అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెంది శేరిలింగంపల్లి రాజకీయాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించింది. గ్రేటర్ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలోని పది డివిజన్లలో భారతీయ జనత పార్టీ అద్భుతమైన ప్రతిభ కనభరించింది. నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ ధర్మపురి అరవింద్ పర్యవేక్షణ లో నియోజకవర్గ నాయకులు స్థానిక ప్రజలకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే చేరువయ్యారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గచ్చిబౌలి డివిజన్ లో 1135 ఓట్లతో విజయం సాధించింది. మిగతా చోట్ల రెండో స్థానంలో నిలిచింది
రవికుమార్ విజయం కోసం యువత .
ఒకప్పుడు బలమైన పార్టీ గా ఉన్న టిడిపి నాయకులు దాదాపుగా ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రవి కమారుడు కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో నాయకులు పెరిగినప్పటికీ అందుకు తగినంత ఓటు బ్యాంకు పెరగకపోగా కొద్దీ శాతం ఓట్లను కోల్పోయింది. ఈ విషయంలో మాత్రం బీజేపీ అనూహ్యమైన ఫలితాలనే సాధించింది అని చెప్పవచ్చు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ప్రజలు ఆశలు వదులుకుని, అధికార పక్షాన్ని నిలదీయగలిగే శక్తి కలిగిన ప్రతిపక్షం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీని ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారనే విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను తనవైపు తిప్పుకోవడంతో పాటు సాధారణ ఓటర్లను సైతం సంపాదించుకున్న బీజేపీ ఇదే రీతిలో విజృంభిస్తే ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గెలుపొందడం ఖాయమని అనుకోవచ్చు.