రాముడి జన్మస్థలం అయోధ్యలో ఓ మహోన్నత ఘట్టం పూర్తయింది. హిందువులంతా వందల సంవత్సరాలుగా కంటున్న కల సాకారమయింది. వచ్చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ప్రపంచం మొత్తం మార్మోగిన అయోధ్య పేరు
అయోధ్య అంతటా రామనామ సంకీర్తనలతో మారుమోగింది. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం… కల నిజమయిన ఉద్విగ్నత..ఆనందం నిండిన మోము తో అయోధ్యవాసులు పులకరించిపోయారు. నగరం మొత్తం శ్రీరాముడి కటౌట్లు, బ్యానర్లతో కాషాయమయం గా మారింది. దేశ విదేశాల నుండి భక్తులు భారీ సంఖ్య లో అయోధ్యకు తరలివచ్చారు. వయసు, వృద్ధాప్యం, అంగవైకల్యం లెక్క చేయకుండా రామభక్తులు అయోధ్య చేరుకున్నారు. కొందరు వేల కిలోమీటర్లు కాలి నడకన, మరి కొందరు మోకాళ్లపై సైతం నడిచి వచ్చి రామయ్యపై ఉన్న భక్తిని చాటుకున్నారు.
ఏర్పాట్లలో భేష్ అనిపించుకున్న యూపీ సర్కార్
అయోధ్యకు వస్తున్న భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. దారి పొడవునా వైద్య సేవ లు, ఆహార ఏర్పాట్లతో పాటు వారికి సహాయం చేయాలంటూ రాష్ట ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరో వైపు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన మహోత్తర కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు విదేశీ మీడియా సైతం అయోధ్యకు చేరుకుంది. మీడియా ప్రతినిధుల కోసం అయోధ్య ట్రస్ట్ ప్రత్యేక మీడియా సెంటర్ను ఏర్పాటు చేసింది. మీడియాకి కావాల్సిన ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఆహార ఏర్పాట్లను భారీగా ఏర్పాటు చేశారు.
కళ్లు తిప్పుకోనివ్వని అలంకరణ
విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. -ఇక రామమందిరం ఫొటో ముద్రించిన విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, క్యాలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు… ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు ప్రతిచోటా రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది.