ఆయన రాజ కుటుంబీకుడు. ఒకప్పుడు సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ లో ఉన్న కుటుంబం ఆయనది. 2020లో బీజేపీలోకి మారి ఆయన కొత్త రూటు వెదుక్కున్నారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. తన వర్గానికి మంచి పదవులు ఇప్పించుకున్నారు. ఇప్పుడు కూడా జ్యోతిరాదిత్య సింధియా బీజేపీకి చాలా కావాల్సిన నాయకుడే. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వర్గం కీలక భూమిక పోషించబోతోంది..
మోదీ నోట సింథియా మాట
2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడానికి జ్యోతిరాదిత్య సింధియా తమతో లేకపోవడమే కారణమని బీజేపీ అధిష్టానం భావిస్తుంటుంది. గ్వాలియర్ – ఛంబల్ ప్రాంతంలోని 34 అసెంబ్లీ స్థానాల్లో బలమైన వర్గాలు సింథియా వెంట ఉన్నాయని వారికి తెలుసు. అందుకే 2020లో సింథియాను బీజేపీ తమ వైపుకు తిప్పుకుంది. ఈ అక్టోబరు 21న సింథియా స్కూలు 125వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ.. ఆయన్ను గుజరాత్ అల్లుడు అంటూ ప్రశంసించారు. మోదీ తన 31 నిమిషాల ప్రసంగంలో 18 నిమిషాలు సింథియా కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకునేందుకు కేటాయించారు. తన లోక్ సభా స్థానం వారణాసితో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
టికెట్ల బట్వాడాలో పెద్ద పీట
సింథియాకు తగిన గౌరవమూ, సముచిత స్థానమూ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ డిసైడైంది. నవంబరు 17న గ్వాలింయర్ – ఛంబల్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండగా.. రెండేళ్ల క్రితం సింథియాతో పాటు బీజేపీలోకి వచ్చిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసింది. అందులో 10 మంది మంత్రులు కూడా ఉన్నారు. గ్వాలియర్లో ప్రచార బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. మోదీ ఉన్న ప్రతీ పోస్టర్లో సింథియా బొమ్మ కనిపిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటో ఉన్న సైజులోనే సింథియా బొమ్మ కనిపించడంతో ఇద్దరూ సమానమేనన్న ఫీలంగ్ వచ్చేస్తోంది. ఆయన కూడా సీఎం అభ్యర్థి కావచ్చన్న ధైర్యమూ కలుగుతోంది.
కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం, సింథియా అనుచరులకు టెన్షన్
అవసరానికి పార్టీ మారి మంత్రి పదవి దక్కించుకుని, విమానయాన మంత్రిత్వ శాఖను చేపట్టిన సింథియాపై కాంగ్రెస్ పార్టీ కూడా కోపాన్ని ప్రదర్శించడంలేదు. అవసరమైతే ఎన్నికల తర్వాత ఆయన పార్టీ ఫిరాయించేందుకు అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. సింథియా అవినీతి కంటే ప్రజా సమస్యలే తమకు ముఖ్యమన్నట్లుగా కాంగ్రెస్ మాట్లాడుతోంది. ఇదిలా ఉండగా బీజేపీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు, మూడేళ్ల క్రితం వచ్చిన సింథియా అనుచరుల మధ్య సంఘర్షణ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు వచ్చి పెత్తనం చేస్తున్నరన్న ఆగ్రహం పాతవారిలో ఉంది. అందుకే ఇరు వర్గాల ఘర్షణల్లో బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయన్న అనుమానమూ కలుగుతోంది. కాంగ్రెస్ ఆలోచన కూడా అదే. వాళ్లు వాళ్లు కొట్టుకుంటే తమకు మంచి జరుగతుందని కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. ఎవరేమనుకున్నా సింథియా తమకు ట్రంప్ కార్డుగా ఉంటారని బీజేపీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి..