మండలి ఎన్నికల్లో గతం కంటే తమ బలం పెరిగిందన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి

మండలి ఎన్నికల్లో వైసీపీ నెగ్గిన స్థానాలలో ఒక రకంగా.. ఇంకో పార్టీ గెలిస్తే మరో విధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దర్పం తో విర్రవీగుతుందని, రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసింది బీజేపీ అని తెలిపారు. ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసింది బీజేపీనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీలో నిలిచామని, ప్రతి ఎన్నికల బరిలో పోటీ చేస్తూవచ్చామని తెలిపారు. మండలి ఎన్నికల్లో మొత్తం 11.56 శాతం ఓట్లు బీజేపీ కి వచ్చాయని తెలిపారు. గతం కంటే తమ బలం రాష్ట్రంలో పెరిగిందని అన్నారు.

సంక్షేమ ఫలాల పరిధిలో పట్టభద్రులు లేరు అని సజ్జల మాట్లాడుతున్నారని, ప్రభుత్వ సలహాదారు లాజిక్కులు ఎవ్వరికీ అర్దం కావడం లేదన్నారు. వాళ్ళ సొమ్ములు వారికి ఇస్తున్నారని పట్టభద్రులు భావించారు కాబట్టే ఓట్లు వెయ్యలేదన్నారు. ప్రి ఫైనల్ ఎలక్షన్స్ లో వైసీపీ ప్రభుత్యం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే లను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అర్థం అవుతుందని, అందుకే ఉత్తరాంధ్రలోనే రాజధాని అని చెప్పినా ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.