పల్లెల కోసం బీజేపీ – పంచాయతీల కోసం బీజేపీ – గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు !

గ్రామ పంచాయతీ నిధుల్ని ఇష్టానుసారంగా దారి మళ్లించేసుకున్న ఏపీ ప్రభుత్వ నిర్వాకంపై ఏపీ బీజేపీ పోరు బాట ప్రకటించింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పదో తేదీన మహాధర్నా చేయనుంది. రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోనల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరుబాట పట్టాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి నిర్ణియంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించుకుందని ఆ విషయంపై పోరాటం చేయాలని కోరారు. పూర్తి స్థాయి వివరాలు తెలుసుకున్న ఏపీ బీజేపీ.. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిర్ధారణకు వచ్చి పోరుబాట పట్టాలని నిర్ణయించారు.

సర్పంచ్‌లకు మద్దతుగా కలెక్టరేట్ల మద్ద మహాధర్నాలు

గ్రామ పంచాయతీల నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించుకుంది. సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళనకు గతంలోనే బీజేపీ మద్దతు పలికింది. పంచాయితీల నిధులను స్వాహాచేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని బీజేపీ నేతుల ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను మళ్లించుకోవడం మోసం చేయడమేనంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితులు ఏర్పడుతున్నాయని… సర్పంచ్‌ల హక్కుల సాధనకై పోరుబాట పట్టాలని డిసైడయ్యారు.

రూ. ఆరున్నర వేల కోట్లకుపైగా పంచాయతీ నిధులు స్వాహా

కేంద్రం పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన ఆరేడు వేల కోట్ల రూపాయల నగదును పంచాయతీల ఖాతాల నుంచి ప్రభుత్వం దారి మళ్లించింది. మామూలుగా పంచాయతీ ఖాతాల్లో నిధులు డ్రామా చేయాలంటే… సర్పంచ్ సంతకం ఉండాలి. అలా చేయకుండా నిధులు మళ్లించడం సైబర్ నేరమని అంటున్నారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనిపై ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించింది.

కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న బీజేపీ

మరో వైపు పూర్తి ఆధారాలతో నిధుల మళ్లింపుపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం గ్రామ సీమల్ని నిర్వీర్యం చేస్తూ… వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకు రావడం.. పంచాయతీల్ని నాశనం చేయడం.. సర్పంచ్‌లకు ఎలాంటి అధికారాలు లేకుండా చేయడం వంటి వాటన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.