టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన, బిజెపిలతో పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై కసరత్ు చేస్తున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి సీట్లు జనసేన, బిజెపి పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్న చోట బీజేపీ సీట్లు కోరుతోంది.
జనసేనకు తిరుపతి సీటు
ఇప్పటికే తిరుపతి సీటు జనసేనకేనని పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తిరుపతి, శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక క్షేత్రాలైన వాటిలో ఒకటి ఖచ్చితంగా తమకు కావాలని బిజెపి పట్టుబట్టడంతో సోమవారం ప్రకటించాల్సిన తుది జాబితా మరోసారి వాయిదా పడింది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్ శ్రీకాళహస్తి సీటు బిజెపికే కేటాయించాలని, తాను పోటీచేసి గెలిచి తీరుతానని అంటున్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం పోస్టర్లు, బ్యానర్లుతో నిండిపోయింది. కమలం గుర్తుకే మీ ఓటు అంటూ పోస్టర్లు వెలిసాయి.
టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఏం చేస్తారు ?
బొజ్జల సుధీర్‌రెడ్డిని గెలిపించాలని అధినేత చంద్రబాబునాయుడు, యువగళంలో నారా లోకేష్ గతంలో ప్రకటించి ఉన్నారు. దీంతో మాజీ ఎంఎల్‌ఎ ఎస్సీవి నాయుడు కినుక వహించారు. కోలా ఆనంద్‌కు టిక్కెట్ వస్తుందని నియోజకవర్గంలో చర్చ జరగడంతో కోలా ఆనంద్‌కు సీటు ఇచ్చినా మనస్ఫూర్తిగా గెలిపిస్తానని అనుయుయులతో చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొజ్జల సుధీర్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని లోకేష్ ద్వారా ఎలాగైనా టిడిపికే ఇచ్చేలా పట్టుబడుతున్నారు. అయితే బీజేపీకే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
తిరుపతి ఎంపీ సీటు, కాళహస్తి అసెంబ్లీ సీటు
తిరుపతిలో నలుగురు పోటీ పడుతున్నప్పటికీ ఈ సీటు జనసేనకే దక్కనుంది. జనసేనలోకి వెళ్లయినా పోటీ చేయాలని టిడిపి ఆశావాహులు పావులు కదుపుతుండటం గమనార్హం. అలాగే తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బిజెపి తీసుకోవడంతో అక్కడ అభ్యర్థిగా కర్నాటక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రత్న ప్రభకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఉపఎన్నికల్లోనూ ఆమె పోటీ చేశారు.