సంగారెడ్డిలో గెలుపెవరిది ? – బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీజేపీ రాజు గండం !

సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక్కడ నామినేష,న్ల వరకూ ముఖాముఖి పోరు ఉంటుందని అనుకున్నారు. కానీ బీజేపీ అభ్యర్థిగా పులిమామిడి రాజును ఖరారు చేయడం ఆయన నేరుగా రంగంలోకి దిగి ప్రచారం ఉద్ధృతం చేయడంతో సీన్ మారిపోయింది.

వినూత్నంగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు

బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పులిమామిడి రాజు తనకు ఒక్క అవకాశం అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంగారెడ్డి నుంచి 2001లో బీజేపీ నుంచి కే.సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి నియోజకవర్గంలో గెలిచి బీజేపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పులిమామిడి రాజు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీజేపీ టిక్కెట్‌ ఆశించిన రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేను కాదని ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన పులిమామిడి రాజుకు నామినేషన్ల రోజు చివరి క్షణంలో బీఫారంను ఇచ్చారు. ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రాజుకు బీజేపీ పార్టీ ఓట్లతో పాటు ముదిరాజ్‌, ఇతర బీసీ కులాల ఓటర్లను నమ్ముకొని ముందకు సాగుతున్నారు. సదాశివపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, పీఎంఆర్‌ ట్ర స్ట్‌ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనకు ప్రజల్లో మద్దతు కనిపిస్తోంది.

డబ్బులు పంచుతానని ఆశ పెడజుతున్న జగ్గారెడ్డి

ఏటీఎంలు పెట్టి డబ్బులు పంచుతానని చెబుతూ జగ్గారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయలేకపోవడంతో అసంతృప్తి ప్రజల్లో ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో లేనందున నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని, తమ ప్రభుత్వం రాగానే కనీవినీ ఎరుగని రీతిలో సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానంటూ హామీలు ఇస్తున్నారు. 2004లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి అప్పటి ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ చొరవతో కాంగ్రె్‌సలో చేరారు. తిరిగి 2009లో గెలిచిన జగ్గారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలిచారు. అయితే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండలేదన్న అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రతికూల అంశాన్ని కరోనా వల్ల రెండేళ్లు గ్రామాల్లో తిరగలేకపోయానంటూ తన ప్రసంగాల్లో వివరణ ఇస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెద్దగా ఆశలు పెట్టుకోని బీఆర్ఎస్

2014లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతా ప్రభాకర్‌, 2018లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా ఆయనకు మంత్రి హరీశ్‌రావు చొరవతో 2022లో రాష్ట్ర చేనేత సహకార అభవృద్ధి సంస్థ చైర్మన్‌ పదవిని ఇచ్చి సముచిత స్థానాన్ని కల్పించారు. ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. చురుగ్గా ఉండలేకపోతున్నారు. సంగారెడ్డిలో మెడికల్‌, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుతో పాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజా క్షేత్రంలోనే నిరంతరం ఉన్నానని సానుభూతి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సామాజిక వర్గాల ప్రకారం చూస్తే.. బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారని.. ఫలితం ఎలా అయినా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి.