షెడ్యూల్ కు ముందే బీజేపీ 160 మంది అభ్యర్థుల ప్రకటన

లోక్ సభ ఎన్నికలకు కూడా బీజేపీ సమాయత్తమవుతోంది. ఈ దిశగా ప్రధాని మోదీ ఎంపీలందరితో గ్రూపులు గ్రూపులుగా సమావేశామయ్యారు. పది రోజులు తిరగకమందే బీజేపీ కొత్త ఆలోచనకు తెరతీసింది. అభ్యర్థుల జాబితాపై దృష్టి పెట్టింది..

అందరికంటే ముందుగా….

ఇతర పార్టీలను షాకులో పడెయ్యాలని బీజేపీ డిసైడైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే తొలి జాబితా విడుదల చేయాలన్న సంకల్పంలో పెద్ద వ్యూహమే ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు, ప్రచారానికి తగిన సమయం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇతర పార్టీలు అభ్యర్థుల వేటలో ఉండగా తాము ఇంటింటి ప్రచారంలో ఉండాలని బీజేపీ లెక్కలేసుకుంటోంది.

ఆయా నియోజకవర్గాల్లో బలహీనమా..

బీజేపీ ఎంపిక చేసుకుని తొలి జాబితాలో విడుదల చేసే 160 మంది అభ్యర్థుల జాబితాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తొలి జాబితా సిద్ధం చేయాలని మోదీ, అమిత్ షా క్యాంపైన్ మేనేజర్లకు ఆదేశాలిచారు. దానితో ఆ 160 నియోజకవర్గాల్లో దక్షిణాదివే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.తెలంగాణలోని 17 లోక్ సభా నియోజకవర్గాల్లో 12 చోట్ల తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయ్యిందని కూడా తెలంగాణ బీజేపీ నుంచి వినిపిస్తున్న మాట.

డిసెంబరులోనే ఎన్నికలు

జమిలీ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి జమిలీ ఎన్నికలు జరగకపోయినా… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిపే ఆలోచన ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. డిసెంబరు లేదా జనవరిలో లోక్ సభకు పోలింగ్ జరిగినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. బీజేపీలో పెద్దలు ఈ దిశగా సంకేతాలు ఇచ్చారని కొందరు అంటుంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్లయితే డిసెంబర్ పక్కా అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అందుకే 160 నియోజకవర్గాల తొలి జాబితాపై దృష్టిపెట్టినట్లు భావించాలి..

ఆ రెండు రాష్ట్రాలే ఆదర్శమా..

బీజేపీ ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు తొలి జాబితాను ప్రకటించింది. అక్కడ కూడా ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. డిసెంబరులో ఎన్నికలకు ఇప్పుడే జాబితా ప్రకటించడంతో గత వారం రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. దీనితో ప్రజల నాడి తెలుస్తోందని బీజేపీ చేసిన మంచి పనులను జనంలోకి తీసుకువెళ్లేందుకు వీలు కలుగుతోందని క్షేత్రస్తాయిలో వినిపిస్తున్న మాట. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉండగా, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భాగేల్ పాలన నడుస్తోంది ఛత్తీస్ గఢ్ ప్రజలు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారన్న సర్వేల నడుమ తొలి జాబితా ప్రకటించిన నియోజవర్గాల్లో అనూహ్య స్పందన కనిపిస్తోందని క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీకి అప్పుడే నివేదికలు వెళ్లాయి. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాయు వేగంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుపుతున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని లాడ్లీ బెహన్ ప్రోగ్రాం కింద 1.25 కోట్ల మంది మహిళలకు అదనంగా తలా రూ.250 రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. ఇక లోక్ సభకు ముందుగా ప్రకటించే 160 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో ఛత్తీస్ గఢ్ నుంచి కాస్త ఎక్కువ మందే ఉండొచ్చని విశ్వసిస్తున్నారు….