కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు విశాఖలో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా సభ జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే విశాఖలో అమిత్ షా సభ ఏర్పాటు చేసినా బీజేపీ రాష్ట్ర నేతలు ఏ మాత్రం పొరపాటు లేకుండా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం విశాఖ పట్టణం లోని రైల్వే పుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదీ !
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్‌కు చేరుకుంటారు. రైల్వే పుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. 7.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నగరంలోని పోర్టు అతిథి గృహానికి వెళ్తారు. అనంతరం సాగరమాల ఆడిటోరియంలో బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. రాత్రి 9.05 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 9.25 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.45 గంటలకు అమిత్ షా ఢిల్లీకి చేరుకుంటారు.
సభకు భారీగా జనం హాజరయ్యే అవకాశం
వాస్తవానికి అమిత్ షా ఈనెల 8న విశాఖపట్టణంకు రావాల్సి ఉంది. కానీ వేరే కార్యక్రమాలు ఉన్నందున పర్యటన వాయిదా పడింది. తిరిగి ఆదివారం ఆయన విశాఖపట్టణం రానున్నారు. అమిత్ షా సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నందున ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్రలో బీజేపీకి మొదటి నుంచి ఉంది. విశాఖ నుంచి ఎంపీలు గెలిచి నచరిత్ర ఉంది. గతంలో ఎమ్మెల్సీలుగా కూడా గెలిచారు. క్యాడర్ అంతా పూర్వ వైభవం కోసం పట్టుదలగా పోరాడుతున్నారు. ఈ కారణంగా అమిత్ షా సభకు పెద్ద ఎత్తున జనం వస్తారని భావిస్తున్నారు.
వరుస సభలతో ఏపీ బీజేపీపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైకమాండ్
ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం అయ్యేలా బీజేపీ కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ) నాటికి బలమైన పార్టీగా ఎదిగేందుకు ఆ పార్టీ కేంద్ర పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటనలు చేస్తున్నారు. ముందు ముందు మరింత మంతి కేంద్ర నేతలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ సభను భారీ సక్సెస్ చేయాలని ఏపీ బీజేపీ నేతలు పట్టుదలగా ఉన్నారు.