ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ మరో వారం పదిరోజుల్లో విడుదలవుతుంది. ఈ లోపే పార్టీల మధ్య సమరం మొదలైంది. బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమి ఒక పక్క, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మరో పక్క ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఒకరి తప్పిదాలను, అవినీతిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాయి.
కమలం పార్టీ ఛత్తీస్ గఢ్ వ్యూహం
సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ పై యుద్ధం చేయాలని బీజేపీ డిసైడైంది. ఛత్తీస్ గఢ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ కేంద్ర మంత్రులను సైతం మోహరించింది. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టే దిశగా భూ-పే యాప్ ను కేంద్ర సమాచార, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆవిష్కరించారు. దాన్ని క్యూ ఆర్ కోడ్ తో తెరిచే వీలుంటుంది. గూగుల్ పే, పేటీఎం తరహాలో అని అర్థం చేసుకోవాలి. దాన్ని తెరిస్తే పేపర్ క్లిప్పింగులు, వీడియోలతో ఒక లఘు చిత్రం చూసే వీలుంటుంది. ఛత్తీస్ గఢ్ భూపేష్ భాగెల్ ప్రభుత్వం అవినీతి మొత్తం అందులో తెలిసిపోతుంది. అవినీతి ఎలా చేయాలి… భూ – పే యాప్ ద్వారా తెలుసుకోండి అన్నది ఇప్పుడు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నినాదం.
రూ.26 వేల కోట్ల స్కాములు
ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.26,000 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు భూ – పే యాప్ లో చూసే వీలుంది. మద్యం, బొగ్గు, పేడ, ప్రజా పంపిణీ వ్యవస్థ, జిల్లా ఖనిజాభివృద్ధి సంస్ఖ, మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలు అందులో పొందుపరిచారు. ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కొల్లగొట్టిందో ఛత్తీస్ గఢ్ ప్రజలు తెలుసుకునేందుకు భూ – పే యాప్ ఉపయోగపడుతుందని అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మాఫియా రాజ్యంగా మార్చిందని బీజేపీ అంటోంది. ప్రతీ పనికి కమిషన్లు వసూలు చేస్తున్నారని చెబుతోంది.
సవాళ్లు, ప్రతి సవాళ్లు
భూ – పే యాప్ పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎదురుదాడికి ప్రయత్నించింది. అనురాగ్ ఠాకూర్ ప్రధాని మోదీ కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రత్యారోపణ చేసింది. గతంలో బీజేపీ నేత రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం, చిట్ ఫండ్, గోవుల పంపిణీ, ఇందిరా ప్రియదర్శిని బ్యాంకులో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ తేల్చింది. దానితో పాటుగా పనామా పేపర్స్ లో ఛత్తీస్ గఢ్ బీజేపీ నేతల పేర్లున్నాయని కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్ పర్సన్ సుశీల్ ఆనంద్ సుక్లా ఆరోపించారు. అయితే ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను సైతం చర్చించేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. రమణ్ సింగ్ ప్రభుత్వంలో పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేస్తూ చర్చ జరగాలని బీజేపీ అంటోంది..