పవన్ కల్యాణ్ ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నదానిపై తేల్చుకోలేకపోతున్నారు. అటు భీమవరం.. ఇటు పిఠాపురం మధ్య ఊగిసలాడుతున్నారు. భీమవరం వెళ్లి అందరితో పరిచయం చేసుకుని వచ్చిన ఆయన ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీకి రెడీ అయ్యారని ప్రచారం ప్రారంభించారు. పవన్ నిర్ణయం తీసుకున్నారని.. అక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
చివరికి పిఠాపురం వైపు మొగ్గిన పవన్ ?
జనసేన అధినేత కొణిదెల పవన్‌కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలంటున్నాయి. పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉందంటున్నారు. భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక తరగతుల ఓట్లు దాదాపు 91 వేలు ఉండటంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
భీమవరం నుంచి టీడీపీ నేత అంజిబాబు జనసేన తరపున పోటీ
భీమవరం మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మార్గం సుగమమైందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఆది నుంచి ప్రచారం సాగింది. దీనిలో భాగంగానే పవన్ ఇటీవల భీమవరంలో పర్యటించి టిడిపి ముఖ్య నేతలు, పట్టణ ప్రముఖులను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఇటీవల టిడిపి, జనసేన అధినేతలు అభ్యర్థుల జాబితా వెల్లడించే సమయంలో జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు. అందులో పవన్ పేరు ఎక్కడా రాలేదు. దీంతో పలు సందేహాలు నెలకొన్నాయి. అంజిబాబు టీడీపీ నేత కావడంతో జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వనున్నారు.
చివరికి మళ్లీ భీమవరమే అన్నా ఆశ్చర్యం లేదు !
విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్ చూపుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ నిలకడలేని తనం గురించి తెలిసిన ఎవరికైనా.. అధికారిక ప్రకటన వచ్చే వరూక నమ్మలేమని అంటున్నారు. పవన్ మళ్లీ భీమవరం నుంచే పోటీ చేస్తానని అన్నా ఆశ్చర్యపోవాల్సింది లేదంటున్నారు.