ఆకలి, కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయ పథాన నడిపిస్తుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం సాకే భారతి. రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించింది. ఇదంతా ఏదో సినిమా కథ కాదు… సాకే భారతి జీవితం. అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. నిత్యం కూలి పనులు చేసి భారతి డాక్టర్ అయ్యింది. రసాయన శాస్త్రంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురు కలిసి వచ్చింది భారతి. పారగాన్ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలసైతం ప్రత్యేక గౌరవం ఇచ్చారు . ఈ విషయం దేశం మొత్తం వైరల్ అయింది.
సాకే భారతి పీహెచ్‌డీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి
కూలీ పని చేస్తూ పీహెచ్‌డీ చేసిన సాకే భారతి విషయాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిపారు. దీంతో ఈ అంశంపై చాలా మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. కొన్ని మీడియాలు.. ఆమె ఇంటర్యూలు కూడా తీసుకున్నాయి. ఈ ఇంటర్యూల్లో ఆమె చెప్పిన మాటలు కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి అందాల్సిన కనీస సహకారం కూడా అందకపోవడంతో ఎన్ని కష్టాలు పడింది వివరించారు. దళిత కుటుంబానికి చెందిన భారతి.. ఇల్లు.. ఉపాధి కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినా పట్టించుకున్న వారు లేరు. ఈ వివరాలన్నీ చెప్పడంతో ప్రభుత్వం తీరుపై చర్చ ప్రారంభమయింది.
పేద – పెత్తందారులు అంటే ఇదేనా అనే చర్చ
పేదల వైపు ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతూంటారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఇంత సాకే భారతి చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినా ఎందుకు సహకకరించలేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం. పైగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రిజర్వుడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ… ఆమె భర్త సాంబశివారెడ్డిదే ఆధిపత్యం .. ఆయన విద్యా సంస్థల అధిపతిగా ఉన్నారు. ఆయన కూడా సాకే భారతిని ఆదుకోలేదని… ఇంటి నుంచి గెంటేశారని అంటున్నారు. సాకే భారతికి ప్రభుత్వం చేసిన అన్యాయంపైనా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా రోల్ మోడల్ లాగా సాకే భారతి విజయం
డాక్టరేట్ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుందని ఆమె చెబుతూ ఉంటారు. అందుకే ప్రయత్నం చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఆమె స్థాయికి అది అద్భుతమైన విజయం. అలాంటి కుటుంబ పరిస్థితుల్లో ఎవరూ అలాంటి పట్టుదల చూపించలేరు. సాకే భారతి ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.ఎందరితో ఆదర్శమని పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. మరి పేదల ప్రభుత్వంగా ముద్ర వేసుకుంటున్న ఏపీ సర్కార్ కు ఆమె కష్టాలు కనిపిస్తాయో లేదో మరి !