తెలుగుదేశంలో అసమ్మతి సెగలు కక్కుతోంది. కడప అసెంబ్లీ టికెట్ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవీరెడ్డికి లభించింది. ఈమె గెలుపు కోసం ఎలాంటి గురిపెడతారనే అంశం చర్చనీయాంశమైంది. పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సతీమణిని నియమించుకోవడంలో పట్టు సాధించిన శ్రీనివాసులరెడ్డి ఎన్నికల గెలుపు కోసం ఎలాంటి వ్యూహం అవలంభించనున్నారు. నియోజకవర్గ నేతల మధ్య సఖ్యత కాదు పూర్తి స్థాయిలో అసంతృప్తి కనిపిస్తోంది.
కష్టపడిన వారికి కాకుండా తన కుటుంబానికి ఇంచార్జ్ పదవి ఇప్పించుకున్న శ్రీనివాసెర్డిడ
టిడిపి అసెంబ్లీ టికెట్ కడప దేశం నేతల మధ్య మరింత అగాధం పెంచింది. ఐదుగురు నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. మాధవి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి మధ్య పోరు సాగింది. కడప అసెంబ్లీ బాధ్యతలను మాత్రం మాధవికి అధిష్టానం కట్టబెట్టింది. టికెట్ కోసం పోరాడుతున్న ఉమాదేవి కుటుంబం తీవ్ర అసంతృప్తికి గురైంది. కొంతకాలంగా శ్రీనివాసులరెడ్డి, లక్ష్మిరెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అసెంబ్లీ టికెట్ వ్యవహారం మరింత అసమ్మతి రగిల్చింది. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని గతంలో చంద్రబాబు వద్ద లక్ష్మిరెడ్డి చెప్పారు.
నేతల మధ్య సర్దుబాటు చేయలేకపోయిన టీడీపీ హైకమాండ్
శ్రీనివాసరెడ్డి మధ్య సర్దుబాటు సాధ్యం ఏమేరకు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా కడప బరిలో తన కోడలు ఉమాదేవిని పోటీ చేయించాలని ఏడాదిగా లక్ష్మీరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఆశించడంతోపాటు, ఇన్‌ఛార్జిగా కొనసాగిన అమీర్‌బాబుకు పదవి తప్పించి మాధవికి ఇచ్చారు. టిక్కెట్ ఆయనకు దాదాపు లేదనే సంకేతం ఇచ్చినట్లు చెప్పవచ్చు. మైనార్టీ నాయకుడికి టికెట్ ఇవ్వని పరిస్థితులు ఏర్పడిన తరుణంలో టిడిపిపై కడప అసెంబ్లీ మైనార్టీల ప్రభావం ఎలా ఉంటుం దన్నది అంచనా వేస్తున్నారు. అమీర్‌బాబును పదవి నుంచి తప్పించడం ఆయన వర్గీయుల్లో అసంతృప్తికి కారణమైందని చెప్పవచ్చు. ఆశావ హులుగా ఉన్న హరిప్రసాద్, గోవర్ధన్‌రెడ్డిలతో అధిష్టానం పిలిచి మాట్లాడలేదన్న అసంతృప్తి వారి అనుచరల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
మైనార్టీలకూ అన్యాయం
1994 నుంచి కడప అసెంబ్లీలో మైనార్టీలే విజయం సాధిస్తూ వస్తున్నారు. రాజకీయంగా కడపలో మైనార్టీలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసిపి ఏవైనా మైనార్టీ అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి కడప అసెంబ్లీపై ఎలాంటి వ్యూహంతో ఉన్నారు. ఇందుకు తోడు ఆయన కడప పార్లమెంట్ అభ్యర్థిగా కూడా కావడంతో అక్కడ పోటీ చేయడం, అదే సమయంలో కడప అసెంబ్లీలో తన సతీమణిని గెలిపించుకోవడం లాంటి వ్యూహం పక్కాగా ఉండాల్సి ఉంటుంది. కానీ గాలికిపోయే పాలపిండి కృష్ణార్పణం అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.