మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా ఇప్పుడు ఎన్నికల సమరంలో కేంద్ర బిందువైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అని చెప్పే కంటే రెండు రాజ కుటుంబాల మధ్య సమరం జరుగుతోందని వివరించడమే కరెక్టు అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ బీజేపీ బలంగా ఉన్నా.. గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది..
ఆ నాలుగు నియోజకవర్గాలు
గుణ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రఘోఘర్, ఛాచౌరా, బామోరీ, గుణ సెగ్మెంట్లు ఉండగా రెండు కాంగ్రెస్, రెండు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఒకప్పటి గ్వాలియర్ రాజ్యంలో భాగమైన రఘోఘర్ రాజకుటుంబీకుడే రాజ్యసభ సభ్యుడైన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా .. గ్వాలియర్ రాజ కుటుంబీకుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఆయన గుణ లోక్ సభా స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.
ఒకప్పుడు దిగ్విజయ్ ఆధిపత్యం…
విమాన ప్రమాదంలో చనిపోయిన మాధవ్ రావ్ సింథియా కుమారుడే జ్యోతిరాదిత్య సింథియా. 1990ల్లో దిగ్విజయ్ కు, మాధవ్ రావ్ సింథియాకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. 1993 నుంచి 2003 వరకు దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాధవ్ రావు సింథియా కేవలం ఒక వర్గానికి నాయకుడిగా ఉండేవారు. చాలా కాలం దిగ్విజయ్ హవా వీచింది. 1977 నుంచి రఘోఘర్ నియోజకవర్గంలో దిగ్విజయ్ కుటుంబ ఆధిపత్యమే సాగుతోంది. ప్రస్తుతం దిగ్విజయ్ కుమారుడు జైవర్థన్ సింగ్ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ సింగ్ పక్కనున్న ఛాచౌరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. జైవర్థన్ కొంతకాలం పాటు కమల్ నాథ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక లక్ష్మణ్ సింగ్ తరచూ కాంగ్రెస్, బీజేపీ మధ్య తిరుగుతూ ప్రస్తుతం హస్తం పార్టీలో ఉన్నారు.
ప్రస్తుతం బలంగా బీజేపీ
దిగ్విజయ్ సింగ్ గ్రూపులు మెయింటెయిన్ చేస్తూ తగాదాలు పెడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఎవరినీ స్థిరేంగా ఉండనివ్వరని, తన ఆధిపత్యం కోసం మరోకరిని బలి చేస్తారని వాదనలు ఉన్నాయి. మరో పక్క అధికారులంతా ఏ పార్టీలో ఉన్నా జ్యోతిరాదిత్య సింథియాకు అనుకూలంగా వ్యవహరిస్తారని కూడా పేరు ఉంది. కమల్ నాథ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా గుణ జిల్లాలోని అధికారులంతా మహారాజు సింథిాయాకు అనుకూలంగా వ్యవహరించారు. ఆ సంగతి తెలిసే సింథియాను బీజేపీ తమ వైపుకు లాక్కుని కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. దానితో దిగ్విజయ్ సింగ్ రాజకీయంగా బలహీనపడి పోయారు.