బియ్యం ధరల అడ్డుకట్టకే ఎగుమతులపై నిషేధం – ప్రవాసులకు బియ్యం కొరత రాకుండా కేంద్రం జాగ్రత్తలు

కొన్నాళ్ల క్రితం ఉప్పు కొరత ఏర్పడుతుందని పుకారు రేగింది. అంతే ఒక్కో ఉప్పు ప్యాకెట్ ను నాలుగు, ఐదు వందలకు కూడా అమ్మారు. నిజానికి ఎలాంటి ఉప్పు కొరత లేదు. కానీ రెండు, మూడు నెలలకు ఓ ఉప్పు ప్యాకెట్ కొనేవాళ్లు ఒకే సారి పది ప్యాకెట్లు కొంటే ఉప్పు కొరత రాకుండా ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితినే .. ఇప్పుడు విదేశాల్లో భారతీయులు చూస్తున్నారు. భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిందని ఇక బియ్యం దొరకదన్నట్లుగా ఒక్కొక్కరు పది ..పదిహేను బస్తాలు కొని పెట్టుకోవాలనుకుంటున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగింది. రేట్లు పెంచేసుకున్నారు. కానీ నిజం ఏమిటంటే.. బియ్యం కొరత అనేది అసాధ్యం

దేశీయంగా ధరలు కంట్రోల్ చేయడానికి ఎగుమతులపై నిషేధం

దేశీయంగా, అంతర్జాతీయంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొన్ని విదేశాలకు బియ్యం విక్రయంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గనున్నాయి. కాగా బియ్యం ప్రపంచ ప్రధాన ఆహారాల్లో ఒకటిగా ఉంది. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం, ఎల్‌నినో వాతావరణ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వరి దిగుమతి తగ్గిపోయింది. ఈ ప్రభావంతో ప్రస్తుతం బియ్యం ధరలు దశాబ్దపు గరిష్ఠస్థాయిలో ఉన్నాయి. మన దేశంలో ఉత్పత్తి బాగానే ఉంది కాబట్టి ధరలు పెరగలేదు. కానీ ముందు మన ప్రజల కడుపు నింపాలి కాబట్టి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.

బియ్యం దిగుమతి చేసుకునే దేశాలకు ఇబ్బందే

ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతానికి పైగానే ఉండడంతో తాజా నిర్ణయం బియ్య దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలపై ప్రభావం చూపవచ్చు. ఆఫ్రికన్ దేశాలు, తుర్కియే, సిరియా, పాకిస్తాన్ వంటి దేశాలపై భారత్ నిషేధం ప్రభావం ఉండొచ్చనే అంచనాలున్నాయి. గ్లోబల్ డిమాండ్ కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బాస్మతేతర బియ్యం ఎగుమతులు 35 శాతం మేర పెరిగాయని మంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో విరిగిన బియ్యం ఎగుమతులపై నిషేధం, బియ్యం ఎగుమతి ట్యాక్స్‌ను 20 శాతం పెంచినప్పటికీ పెరుగుదలే నమోదయ్యిందని పేర్కొంది. కాగా గతేడాది భారత్ 10.3 మిలియన్ టన్నుల బాస్మతేతర బియ్యాన్ని ఎగుమతి చేసిందని రిపోర్టులు చెబుతున్నాయి. కాగా భారత్‌లో ఈ ఏడాది బియ్యం ధరలు మార్చిలో 14-15 శాతం మేర పెరిగాయి. ఈ మధ్య కూడా భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ పరిస్థితిని దేశీయ ఆహార భద్రత, ధరల పెరుగుదల కోణంలోనే చూడాలని కేంద్రం స్పష్టం చేసింది.

అమెరికాలో ఆహార కొరత రాదు.. బియ్యం కొరత రాదు !

ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆందోళన కనిపిస్తోంది. కానీ ఇప్పటికే ఏడాది వరకూ సరిపడా ఎగుమతులను ఆయా దేశాలకు చేసినట్లుగా ఎగుమతి దారులు చెబుతున్నారు. అక్కడ ప్రజలు ఎంత అవసరమో.. అంతే కొనుగోలు చేస్తే కావాల్సింత బియ్య అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కంగారు పడి ఎంత కావాలంటే అంత కొనాలనకుంటే… కృత్రిమ కొరత ఏర్పడుతుందని గుర్తు చేస్తున్నారు.