రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. సరయు నదీ తీరంలో రాములోరి మందిర నిర్మాణం చకచకా జరుగుతోంది. గర్భగుడిలో రామయ్య కొలువుతీరే ముహూర్తం దగ్గరపడుతుండడంతో అయోధ్యకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపైనా భక్తులకు అమితమైన ఆసక్తి ఉంది. ఇందులో భగంగా గర్భగుడి ఎదురుగా కొలువుతీరే 2100 కిలోల బరువైన బాహుబలి గంట ప్రత్యేకత ఏంటో తెలుసా…
అష్టధాతువుతో తయారు చేసిన గంట
రామ మందిరం నిర్మాణం పూర్తైపోతోంది. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆలయంలో ప్రతి అడుగుని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ముఖద్వారం నుంచి గర్భగుడివరకూ ఎన్నో ప్రత్యేకతలు. అందులో గంటకూ స్థానముంది. రామయ్య ఆలయంలో ఏర్పాటు చేయనున్న గంట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తయారు చేయించింది అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యూపీలోని జలేసర్ మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ వికాస్ మిట్టల్ కర్మాగారంలో తయారైన ఈ గంట ఇప్పటికే ట్యూటికోరిన్ నుంచి అయోధ్యకు భారీ క్రేన్ సాయంతో తరలి వెళ్ళింది.
అష్ట ధాతువులు అంటే!
- బంగారము, 2. వెండి, 3. రాగి, 4. ఇనుము, 5. తగరము, 6. సత్తు, 7. సీసము, 8. కంచు
2100 కిలోల బరువైన గంట
రామాలయంలో నెలకొల్పే 2100 కిలోల బరువైన గంట హిందూ ముస్లిం ఘంటా నాదంగా మారనుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గంటను ఇక్బాల్ మిస్త్రీ అనే ముస్లిం కళాకారుడు రూపకల్పన చేశారు.. 2,100 కిలోల బరువైన ఈ గంట 6′ X 5′ పొడువు, వెడల్పు ఉంది.
15 కిలోమీటర్లు వినిపించే శబ్ధం
ఈ గంటను ఒక్కసారి మ్రోగిస్తే.. గంట నుంచి వెలువడే శబ్దం దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించనుందట. ఇక్బాల్ మిస్త్రీ, దావుదయళ్ బృందంతో పాటు దాదాపు 25 మంది 4 నెలల పాటూ కష్టపడి తయారు చేశారు. ఈ గంట తయారీకి 21 లక్షల రూపాయలు వ్యయం అయింది.
యూపీలో తయారైన గంట
ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్ జిల్లా… దేవాలయాలలో ఉపయోగించే గంటల తయారీ కళాకారులకు ప్రసిద్ది. ఈ ప్రాంతంలోని కళాకారులు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతారు. జిల్లాలోని జలేసర్లో గుడిలో గంటలను తయారు చేసే ఫ్యాక్టరీలు దాదాపు 300 ఉన్నాయి. అయోధ్య రామయ్యకు తయారు చేసిన గంట 6 అడుగుల పొడవు,5 అడుగుల వెడల్పు ఉంది. ఈ గంట ఇప్పటి వరకూ భారతదేశంలో తయారు చేసిన అతిపెద్ద గంట అంటున్నారు.