ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. అలవిగాని హామీలిచ్చి ఖజానా ఖాళీ చేయడం, తర్వాత జనాన్ని అప్పులు ఊబిలోకి నెట్టడం కూడా బీజేపీయేతర పార్టీలు రివాజుగా పెట్టుకున్నాయి. అప్పుల మీద అప్పులు చేస్తూ వ్యవస్థను దివాలా తీయించడం పరిపాటిగా మారింది. నిధులు చాలక ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జనాన్ని బాదుతూ సర్దుబాట్లు చేయడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఈ చేత్తో పది రూపాయలిచ్చి, ఆ చేత్తో వంద రూపాయలు లాగేసుకోవడం ఓ టెక్నిక్ . కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేయబోతోంది..
భూముల విలువ పెంపు..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలను ప్రస్తావించింది. సాధారంగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక గ్యారెంటీకి సంబంధించిన ఫైలుపైనైనా సంతకం పెడతారని ఎదురు చూడగా.. సిద్దరామయ్య ప్రభుత్వం కొంత టైమ్ తీసుకుంటోంది. గృహ జ్యోతి.అన్న భాగ్య, ఉచిత విద్యుత్ లాంటి పథకాలకు ఏడాదికి కనీసం రూ. 50 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలో అమలు చేయాల్సిన ఈ ఐదు హామీల కోసం నిధుల వేట మొదలెట్టారు. అందులో భాగంగా భూముల క్రయవిక్రయాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ప్లాన్ వేశారు. స్థిరాస్తులు గైడెన్స్ వ్యాల్యుని 15 శాతం మేర పెంచేందుకు సీఎం సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని వల్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. కర్ణాటక ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం స్థిరాస్తుల గైడెన్స్ వాల్యూ పెంపు వల్ల ప్రభుత్వ వార్షికాదాయంలో 20 శాతం పెంపు కనిపిస్తుంది.
అధికారుల మీద దాడులు
ఎన్నికల్లో గెలిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానితో ఆశపడి ఓటేసిన పేద, మధ్య తరగతి వర్గాల్లో చాలా మంది కరెంట్ బిల్లులు కట్టడం మానేశారు. తాము 200 యూనిట్లలోపే వాడుతున్నామని చెప్పుకుంటున్నారు. కరెంట్ బిల్లులు బకాయిలు ఉన్నాయని అడిగేందుకు వెళ్లిన అధికారులపై చిత్రదుర్గ సహా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఉచిత విద్యుత్ అమలు కాబోతున్నప్పుడు ఛార్జీలు కట్టాలని అడగడమెందుకని జనం, అధికారులపై మండి పడుతున్నారు. మేము 200 యూనిట్లలోపే వాడుతున్నాం, మమ్మల్ని కరెంట్ బిల్లులు అడగొద్దు అని తమ ఇళ్ల బయిట ప్లకార్డులు పెట్టేసి అధికారులు వచ్చినప్పుడు వాటిని చూపిస్తున్నారు..
కరెంట్ ఛార్జీలు పెంచుతారా…
కొన్ని ప్రభుత్వాలు చాలా టెక్నిక్ గా వ్యవహిరిస్తున్నాయి. ఇచ్చిన హామీని అమలు చేస్తూనే మరో రకంగా బాదిస్తున్నాయి. పంజాబ్ ప్రభుత్వం రెండు నెలలకు 600 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించింది. అంతకంటే ఎక్కువ వాడుతున్న వారికి 10 శాతం పైగా విద్యుత్ ఛార్జీలను ఇటీవలే పెంచింది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడంతో దాదాపు చాలా మంది అదనపు ఛార్జీలు చెల్లించక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్ లోని భగవంత్ మాన్ ప్రభుత్వ తరహాలోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతుందని కన్నడీగులు భయపడుతున్నారు.