త్వరలో ప్రారంభం కానున్న అయోధ్య రామమందిరం పనులు శరవేగంగా జరుగున్నాయి. రామ మందిరానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి భక్తులకు ఉంటుంది. ఇందులో భాగంగా 70 ఎకరాల రామమందిర ప్రాంగణం ఎలా ఉంటుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం..
ఆలయ సూపర్ స్ట్రక్చర్ మూడు అంతస్తులుగా ఉంటుంది. తూర్పు వైపు నుంచి ప్రవేశం..దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ఉంటుంది. ప్రధాన ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కాలి.
ఆలయ సముదాయం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఇది 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.
సాధారణంగా ఉత్తరాదిలోని దేవాలయాలకు గర్భగుడి చుట్టూ ఖాళీ స్థలం ఉండదు కానీ అయోధ్యలో రామాలయానికి 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల వెడల్పుతో ఖాళీ స్థలం ఉంటుంది. దీనికి నాలుగు మూలలను సూర్యభగవానుడు, భగవతి, వినాయకుడు, శివుడికి అంకితం చేశారు. ఉత్తరం వైపు అన్నపూర్ణ మాత, దక్షిణం వైపు హనుమంతుడు ఉంటారు.
వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, మాతా షబ్రీ, దేవి అహల్యలకు ప్రత్యేక ఆలయాలు ఉంటాయి. అయోధ్యలోని కుబేరుడి తిల వద్ద జటాయువు విగ్రహాన్ని ప్రతిష్టించారు
అయోధ్య రామాలయం ప్రాంగణంలో ఉన్న కాంప్లెక్స్ లో హెల్త్ కేర్ సెంటర్, టాయిలెట్ బ్లాక్స్ ప్రత్యేకంగా ఉంటాయి. భక్తులు దర్శనానికి ముందు తమ బూట్లు, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 25 వేల మంది వరకు ఒకేసారి వీటిని డిపాజిట్ చేసుకోవచ్చు. వేసవిలో సందర్శకులు ఫెసిలిటీ సెంటర్ నుంచి ఆలయం వరకు ఎండలో చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
ఆలయ సముదాయంలో 70 ఎకరాల్లో 70 శాతం గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వందేళ్లకు పైబడిన చెట్లు ఉంటాయి. సూర్యకిరణాలు భూమికి చేరలేనంత దట్టమైన అడవిలా ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేయబోతున్నాం అన్నారు నిర్వాహకులు
కాంప్లెక్స్ లో రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డెడికేటెడ్ విద్యుత్ లైన్ ఉంటాయి. భూగర్భ జలాశయం నుంచి నీటిని సేకరించే అగ్నిమాపక దళ పోస్టు ఉంటుంది. ఇక్కడ భూగర్భ జలమట్టం ఎప్పటికీ తగ్గదు. అవసరమైతే సరయూ నది నుంచి నీటిని తీసుకుంటారు.