అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలనేది కోట్లాది హిందువుల దశాబ్దాల నాటి కల. త్వరలోనే అయోధ్య రాముడు గర్భగుడిలో కొలువుతీరనున్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళ మూడు దశాబ్ధాల వ్రతం పూర్తైంది.. అయోధ్య రాముడికి-ఆమె వ్రతానికి ఏంటి సంబంధం అంటే..
30 ఏళ్లుగా మౌనవ్రతం
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని దశాబ్దాలుగా పోరాటం జరిగింది. యాగాలు, వ్రతాలు, నోములు ఎవరికి తోచింది వారు ఫాలో అయ్యారు. 85 ఏళ్ల ఓ వృద్ధురాలు అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం జరగాలని మౌన వ్రతం చేస్తోంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని కరమ్‌తాండ్ కి చెందిన సరస్వతి అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని 30 సంవత్సరాల క్రితం శపథం చేసింది. ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్నందున ఆమె అయోధ్యకు చేరుకోనుంది. విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయిన తర్వాత ‘రామ్, సీతారాం’ అంటూ 30 ఏళ్ల మౌన దీక్షను విరమించనుంది.
రాముడి స్మరణకే జీవితం అంకితం
శ్రీరాముడి పట్ల 3 దశాబ్దాలుగా అమితమైన భక్తిని చూపిస్తున్న సరస్వతి అగర్వాల్ తన జీవితాన్ని రామ స్మరణకే అంకితం చేసినట్లు పేర్కొంది. ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మితం కావడంతో ఇక నుంచి అయోధ్యలోనే ఉండాలని నిర్ణయించుకుంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాల రాముడు తనను ఆహ్వానించాడని.. 30 ఏళ్లుగా తాను చేస్తున్న తపస్సు విజయవంతమైందని సంతోషపడుతోంది. ఇకపై అయోధ్యలోని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలో ఉండనుంది. తన భావాలన్నింటినీ రాతపూర్వకంగా మీడియాకు తెలియజేశారామె.
ప్రత్యేక ఆహ్వానం
సరస్వతి అగర్వాల్‌కు కూడా అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. 1992 మేలో అయోధ్యకు వెళ్లిన సరస్వతి అగర్వాల్.. రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. తర్వాత కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేసిన తర్వాత చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. ఇక 1992 డిసెంబర్ 6 వ తేదీన ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిసి.. ఆ తర్వాత మౌన వ్రతం ప్రారంభించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యాకే మౌన వ్రతం వీడాలని నిశ్చయించుకున్నారు.
35 ఏళ్లక్రితం సరస్వతి భర్త మరణించారు. ఆమెకు ముగ్గురు సంతానం. రాముడికోసం చేస్తున్న మౌనదీక్షకు వారంతా సహకరించారు..